Published : 11/06/2021 14:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేసుల మాఫీకే జగన్‌ దిల్లీ పర్యటన: యనమల

అమరావతి: బెయిల్‌ రద్దు భయంతో కేసుల మాఫీ కోసం కేంద్ర పెద్దల ముందు సాష్టాంగ పడేందుకే సీఎం జగన్‌ దిల్లీ పర్యటన తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. పర్యటనకు సంబంధించిన వివరాలు ప్రజలకు వెల్లడించకపోవడంతోనే లోపాయికారి ఒప్పందమనే విషయం బహిర్గతమవుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు యనమల ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో సరైన కార్యాచరణ, ప్రణాళిక లేదని విమర్శించారు. విభజన హక్కుల సాధనలో సీఎం జగన్‌, వైకాపా ఎంపీలు ఘోరంగా విఫలమయ్యారన్నారు. జగన్‌ అక్రమంగా సంపాదించిన రూ.43వేల కోట్లను రాష్ట్ర ఖజానాకు జమచేస్తే రెవెన్యూ లోటు తగ్గుతుందని యనమల వ్యాఖ్యానించారు.

‘‘25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ముందు చెప్పి.. ఇప్పుడు మూగనోము పాటిస్తూ ప్రజల గొంతు కోశారు. హోదా వస్తే ఒంగోలు కూడా హైదరాబాద్‌లా తయారవుతుందని, పెట్టుబడులు, ఉద్యోగాలు, నిధులు వస్తాయని యువతకు చెప్పిన జగన్‌.. నేడు కేంద్రాన్ని ఎందుకు అడగలేకపోతున్నారో సమాధానం చెప్పాలి. ప్రజల్ని మోసగించి ఓట్లు దండుకునేందుకే హోదా అంశాన్ని వాడుకున్నారు తప్ప చిత్తశుద్ధితో కాదు. ఇడుపులపాయకే పరిమితమైన ఉన్మాదాన్ని రాష్ట్రమంతటికీ విస్తరించి మూడు రాజధానుల పేరుతో విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ఉపయోగపడని మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కి నెట్టారు. కొత్త పరిశ్రమలు లేక యువతకు ఉద్యోగాలు లభించట్లేదు. రాష్ట్రానికి ఆదాయం లేక రూ.లక్షలాది కోట్లు అప్పులు చేయడంతోపాటు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టే స్థితికి దిగజారారు. ప్రభుత్వ భవనాలు, స్థలాలను తనఖా పెట్టి రూ.5వేల కోట్లు సమీకరించాలనుకోవడం జగన్‌ అసమర్థ విధానాలకు నిదర్శనం. తక్షణమే భూవిక్రయాలు, తనఖా నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి’’ అని యనమల డిమాండ్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని