రేషన్‌ భారం తగ్గించండి: జగన్‌
logo
Published : 11/06/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేషన్‌ భారం తగ్గించండి: జగన్‌

రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌తో జగన్‌ భేటీ

దిల్లీ: రెండు రోజుల దిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమయ్యారు. కొవిడ్‌ కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రికి వివరించారు. మరో రెండు నెలలపాటు ఉచిత బియ్యం పంపిణీని కేంద్రం పొడిగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

2015 డిసెంబర్‌ వరకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఏపీలో 1.29 కోట్ల రేషన్‌ కార్డులకు 1,85,640 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా కేటాయిస్తున్నట్లు జగన్‌ తెలిపారు. 2015 తర్వాత 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో 60.96 శాతం కుటుంబాలకు, పట్టణాలు, నగరాల్లో 41.14 శాతం కుటుంబాలకు మాత్రమే పరిమితం చేసి బియ్యం పంపిణీ చేస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల్లో 76.04 శాతం, అర్బన్‌లో 49.36 శాతం; గుజరాత్‌లో రూరల్‌లో 76.64 శాతం, అర్బన్‌లో 48.25 శాతం, మహారాష్ట్రలో రూరల్‌లో 76.32 శాతం, అర్బన్‌లో 45.34 శాతం మేర కుటుంబాల ప్రాతిపదికన బియ్యం కేటాయిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు రేషన్‌ బియ్యాన్ని కేటాయిస్తున్న విధానం రాష్ట్ర విభజనకు ముందు నిర్ణయించిందని.. తెలంగాణ, ఏపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా కేటాయిస్తున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ కన్నా ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినవేనని.. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని జగన్‌ వివరించారు.

రేషన్‌కార్డులకు అర్హులైన వారిని గుర్తించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ గతంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించిందని.. పారదర్శక పద్ధతిలో సర్వే జరిపి 1.47 కోట్ల రేషన్‌కార్డుదారులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద అమలు చేస్తున్న కార్యక్రమానికి అర్హులని తేల్చినట్లు చెప్పారు. ఈ వివరాలన్నింటినీ డిజిటలైజేషన్‌ కూడా చేసినట్లు వెల్లడించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద హేతుబద్ధతలేని కేటాయింపుల కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని.. వీరందరి రేషన్‌ భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తోందన్నారు. ఇది రాష్ట్రానికి చాలా భారమని, వెంటనే దీన్ని సరిదిద్దాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలంటే బకాయిల విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని