బ్లాక్‌ ఫంగస్‌ వైద్య సేవలకు సహకరిస్తాం: కలెక్టర్‌
logo
Updated : 13/06/2021 05:38 IST

బ్లాక్‌ ఫంగస్‌ వైద్య సేవలకు సహకరిస్తాం: కలెక్టర్‌


పిన్నమనేని సిద్ధార్థ కొవిడ్‌ ఆసుపత్రిని సందర్శిస్తున్న కలెక్టర్‌ జె.నివాస్‌

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: పిన్నమనేని సిద్ధార్థ కొవిడ్‌ ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు చికిత్సను అందిస్తే.. ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకరిస్తామని కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. శనివారం గన్నవరం మండలం చిన్నఅవుటపల్లిలోని ఆసుపత్రి ప్రాంగణాన్ని జేసీ శివశంకర్‌, సబ్‌ కలెక్టర్‌ ప్రతిష్ఠ మంగైన్‌, డీఎంహెచ్‌వో సుహాసిని, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ ఉస్మాన్‌తో కలిసి కలెక్టర్‌ సందర్శించారు. అక్కడ బాధితులకు అందుతున్న చికిత్సను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన కలెక్టర్‌.. ఆసుపత్రి యాజమాన్యం, పర్యవేక్షక అధికార బృందం సేవలను అభినందించారు. అనంతరం ఆసుపత్రిలో పడకలు, సౌకర్యాలపై ఆరా తీశారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ అనిల్‌కుమార్‌, వైద్యులు కోనేరు కల్యాణి, చక్రధర్‌, హిమవంత్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


ముందస్తు అవసరాల కోసం ఇసుక నిల్వలు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వర్షా కాలం నేపథ్యంలో నిర్మాణ రంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచాలని కలెక్టరు జె.నివాస్‌ అధికారులకు సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలోని విడిది కార్యాలయంలో ఇసుక నిల్వలు, రేవులు తదితరాలపై శనివారం సాయంత్రం సమీక్షించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువున 48, దిగువున 10 ఇసుక రేవుల నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులను జేపీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించామన్నారు. ఇప్పటి వరకు 13 రేవుల ద్వారా ఇసుకను అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను ఉచితంగా కూపన్ల ద్వారా అందించాలన్నారు. రేవుల నిర్వహణపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలన్నారు. సమీక్షలో గనుల శాఖ డీడీ ఎం.సుబ్రహ్మణ్యం, ఏడీ వి.నాగిణి, జిల్లా ఇసుక అధికారి వై.నాగయ్య, జేపీ వెంచర్స్‌ ప్రతినిధి డి.లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని