మూడో దశ రాకుండా చూడడానికే తొలి ప్రాధాన్యం
logo
Published : 13/06/2021 03:38 IST

మూడో దశ రాకుండా చూడడానికే తొలి ప్రాధాన్యం


అనురాగ్‌ వృద్ధాశ్రమంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, పక్కన కమిషనర్‌ అనురాధ

పట్టాభిపురం, న్యూస్‌టుడే: కరోనా మూడో దశ రాకుండా చూడడమే మా తొలి ప్రాధాన్యమని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని రవీంద్రనగర్‌ అనురాగ్‌ వృద్ధాశ్రమం, పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆయన శనివారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. రోజుకు జిల్లా వ్యాప్తంగా 10,000 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. సగటున 500 కేసులు నమోదవుతున్నాయి. నిరంతరం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కొనసాగించడం ద్వారా కరోనాను నియంత్రిచవచ్చన్నారు. గ్రామస్థాయిలో జ్వరాల సర్వే చేపట్టాం. పాజిటివ్‌ లక్షణాలు కనిపించిన వారికి పరీక్షలు జరిపి హోం ఐసొలేషన్‌లో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్సకు అవసరమైన మెడికల్‌ కిట్స్‌ అందిస్తున్నామని వివరించారు. జిల్లాలో మొత్తం 155 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వృద్ధులు, దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. జిల్లాలో మొత్తం 43 వయో వృద్ధుల ఆశ్రమాలు ఉండగా, 1200 మందికి అక్కడికే వెళ్లి వ్యాక్సిన్‌ వేయిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పాటిబండ్ల సీతారామయ్య పాఠశాలలో ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు ఈ కేంద్రంలో 1047 మందికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయించామని వివరించారు. కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి చంద్రశేఖర్‌, గుంటూరు పశ్చిమ తహశీల్దార్‌ మోహనరావు, కార్పొరేటర్‌ ఈరంటి వరప్రసాద్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని