ఆదర్శ డివిజన్లకు శ్రీకారం
logo
Published : 13/06/2021 03:38 IST

ఆదర్శ డివిజన్లకు శ్రీకారం

ప్రతిపాదిత అభివృద్ధి పనులివి...

ఈనాడు, అమరావతి

సెంట్రల్‌ డివైడర్‌ నిర్మాణానికి ప్రతిపాదించిన బ్రాడీపేట నాలుగో లైను

గుంటూరు నగరంలో 7, 32 డివిజన్లను ఆదర్శ డివిజన్లుగా (మోడల్‌ డివిజన్లు) అభివృద్ధి చేయాలని నగరపాలక సంస్థ నిర్ణయించి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. ఈ రెండింటిని ప్లాస్టిక్‌ రహిత డివిజన్లుగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటోంది. రెండు డివిజన్లలో కలిపి 4,600 నివాసాలు ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది. నివాస గృహాలు, షాపులు, కాంప్లెక్సుల్లో వెలువడే తడి, పొడి చెత్తతో పాటు ప్రమాదకరమైన వస్తు సామగ్రిని వేరు వేసి నగరపాలక పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలి. ఇందుకోసం ఇంటికి మూడేసి చెత్తబుట్టల (డస్ట్‌బిన్లు) పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. చెత్తబుట్టలను సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీపెట్‌తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ సోమవారం నాటికి వాటిని తయారు చేసి అందించనుంది. ఇంటికి మూడు చొప్పున 4,600 నివాసాలకు 13,800 బిన్లు సమకూర్చుకుంటున్నారు. ఇంతకుముందే ఆ రెండు డివిజన్లు యూజర్‌ ఛార్జీలతో ఇంటింటి నుంచి చెత్త సేకరించే ప్రయోగాత్మక కార్యక్రమానికి ఎంపికయ్యాయి. ఆ డివిజన్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు వసతులు కల్పించనున్నారు.

ఆ రెండు డివిజన్లలో రహదారులు, కాల్వలు, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌, ఉద్యానవనాలు, పిల్లలకు ప్రత్యేకంగా పార్కులు, నడక ప్రియులకు వాకింగ్‌ ట్రాకులు, ఆరుబయట వ్యాయామశాలలు, ప్రతి రహదారిలో ఆహ్లాదకరమైన మొక్కల పెంపకం వంటివి చేపడతారు. ఈ రెండు డివిజన్లలో సుందరీకరణకు ప్రధాన రహదారుల్లో సెంట్రల్‌ డివైడర్లు నిర్మించి వాటి మధ్యలో ఆహ్లాదకరమైన మొక్కలు పెంచుతారు. ప్రధాన కూడళ్లలో డివైడర్ల అభివృద్ధి, షాపింగ్‌కు వచ్చేవారి వాహనాల కోసం శాశ్వత పార్కింగ్‌ ప్రదేశాలను అభివృద్ధి చేస్తారు. మల, మూత్ర విసర్జన కోసం సులభ్‌ కాంప్లెక్సులు నిర్మిస్తారు. భూగర్భ లైన్ల ద్వారా విద్యుత్తు, కేబుల్‌ తీగలను వేస్తారు.

నగర మేయర్‌, కమిషనర్లతో కలిసి నగరపాలక ఇంజినీరింగ్‌ అధికారులు ఆ డివిజన్లలో ఇప్పటికే పర్యటించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు రూపొందించారు. 32వ డివిజన్‌ పూర్తిగా బ్రాడీపేట ప్రాంతంతో విస్తరించింది. ఈ ప్రాంతంలో గతంలోనే పలు రహదారులు, డ్రెయిన్లు నిర్మించి కొంతమేరకు సౌకార్యలు కల్పించారు. ప్రస్తుతం ఆదర్శ డివిజన్ల కోసం ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సుమారు రూ.2కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. 7వ డివిజన్‌లోనూ రహదారులు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతులు కొంతమేరకు ఉన్నాయని, మిగిలిన కార్యక్రమాల నిర్వహణకు సుమారు రూ.3కోట్లు అవుతుందని ప్రాథమికంగా నిర్ణయించామని నగరపాలకవర్గాలు తెలిపాయి. బ్రాడీపేట నాలుగో లైనులో సెంట్రల్‌ డివైడర్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒకటో అడ్డరోడ్డు నుంచి 19వ అడ్డరోడ్డు పీకలవాగు వరకు విస్తరించిన ఈ రహదారిని సెంట్రల్‌ లైటింగ్‌తో కనువిందు చేయాలని ప్రణాలిక రూపొందించారు. ఈ రహదారిలో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా, దుమ్ము, ధూళి తలెత్తకుండా డ్రెయిన్‌ టూ డ్రెయిన్‌ నిర్మాణం చేపట్టడానికి అంచనాలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుతం డ్రెయిన్‌ టూ డ్రెయిన్‌ లేదు. కొంతమేరకే డ్రైయిన్లు ఉన్నాయి.


చెత్త బయటేస్తే దుకాణం సీజ్‌

బ్రాడీపేట ప్రముఖ వర్తక కేంద్రం కావడంతో ఇక్కడ షాపులు, కాంప్లెక్సులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం కొందరు వ్యాపారులు తమ షాపు పక్కనే ఉండే సైడు కాల్వలు లేదా రహదారి మీద ఆ చెత్తను పడేసి చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో రహదారులపై చెత్త పేరుకుపోతోంది. ఇంటింటికి చెత్త బుట్టలను నగరపాలక పంపిణీ చేస్తుంది. వ్యాపారులే తమ షాపుల్లో వచ్చే చెత్తా చెదారులను పడేయడానికి సొంతంగా బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని నగరపాలక వర్గాలు సూచించాయి. ఇక మీదట వ్యాపారులు ఎవరైనా చెత్తను బయటపడేస్తే దుకాణం సీజ్‌ చేయడంతో పాటు నగరపాలక జారీ చేసే షాపు అనుమతి లైసెన్సును రద్దు చేసేలా ముందుస్తు హెచ్చరిక నోటీసులు జారీ చేసి వ్యాపారవర్గాలను అప్రమత్తం చేయనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో టీ బంకులు మొదలుకుని పెద్ద హోటళ్ల దాకా ఎవరైనా ప్లాస్టిక్‌ కప్పులు, ప్లేట్లు వాడితే వాటిని తడి, పొడి చెత్తలో కలపకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న డస్ట్‌బిన్‌లోనే పడేయాలని సూచించనున్నారు. సాధ్యమైనంత వరకు హోటళ్లల్లో ప్లాస్టిక్‌ వినియోగానికి స్వస్తి పలికించాలనేది నగరపాలక యోచన. అప్పుడే వాటిని ప్లాస్టిక్‌ రహిత డివిజన్లుగా అభివృద్ధి చేయగలమని చెబుతున్నారు. ఈ రెండు డివిజన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తయిందని నగరపాలకవర్గాలు తెలిపాయి. ‘ప్రతి అపార్టుమెంటులో ఇంకుడుగుంత ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. ప్రతి ఇంటా ఒక మొక్కను నాటించి భవిష్యత్తులో అధిక ఉష్ణోగ్రతలను తగ్గించేలా అభివృద్ధి కార్యాచరణ రూపొందించినట్లు’ అధికారి ఒకరు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని