నచ్చిన సీమల్లో మెచ్చేలా విధులు
logo
Published : 13/06/2021 03:38 IST

నచ్చిన సీమల్లో మెచ్చేలా విధులు

పర్యటక ప్రదేశాల్లో పని

కరోనా విపత్తులో వినూత్న యోచన

ఈనాడు, అమరావతి

రోనా విపత్కర పరిస్థితుల్లో మనం పర్యటక ప్రాంతాలకు వెళ్లడం అనేమాట పక్కన పెట్టి అసలు ఆరోగ్యంగా ఉండి పని చేసుకోవడమే మహద్భాగ్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో కొందరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఐటీ ఇంజినీర్లు, ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగులు పర్యటక ప్రాంతంలో పనిచేయడం(వర్కోకేషన్‌)ను ఎంచుకుని కార్యాలయ విధులతో పాటు తమ సెలవులను నచ్చిన ప్రాంతాల్లో ఆహ్లాదంగా గడిపేస్తున్నారు. వర్క్‌ ఇన్‌ వెకేషనే ఈ వర్కోకేషన్‌. హిమాలయ పర్వతాల మధ్య ఉండే కసోల్‌ కావచ్చు బీచ్‌లకు ప్రసిద్ధి గాంచిన గోవా కావచ్ఛు.. ప్రకృతి అందాలకు నిలయమైన కూర్గ్‌ ఇలా ఎక్కడైనా సరే హైస్పీడ్‌ అంతర్జాలం(ఇంటర్నెట్‌) ఉండి నెలకు రూ.20వేల లోపు ఉండే వసతి దొరికితే చాలు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎగురుకుంటూ వెళ్లిపోయి నెలల పాటు అక్కడే గడిపేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మానసికోల్లాసం కలిగి పనిలో నాణ్యత కూడా పెరుగుతుండడంతో కంపెనీలు అభ్యంతరం చెప్పడం లేదు. కరోనా వల్ల అనేక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయమని కోరుతున్నాయి. ఇది కొద్ది రోజులైతే పర్లేదు కానీ నెలల తరబడి ఇళ్ల నుంచే పనిచేయాల్సి రావడంతో ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం పర్యటక ప్రాంతాల్లో పనిచేసే వెసులుబాటును ఎంచుకుంటున్నారు.

సౌకర్యాలతో కూడిన వసతి

ట్రావెల్‌ ఏజెన్సీలు కూడా చక్కగా శానిటైజ్‌ చేసిన క్యాబ్‌లు ఏర్పాటు చేసి విమానాశ్రయం నుంచి రవాణా సౌకర్యం కల్పిస్తుండడంతో ఉద్యోగులు కరోనా భయం లేకుండా వెళుతున్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతిగృహాలు, రిసార్ట్‌లు, శానిటైజేషన్‌, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అదే సమయంలో నెలకు రూ.10వేలతో కులూమనాలి, గోవా, గోకర్ణ వంటి ప్రాంతాల్లో వసతి అందిస్తుండడంతో ఐటీ ఉద్యోగులు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. సినిమాల ప్రభావం వల్ల కావచ్ఛు.. తాము ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పలు ప్రాంతాలు సందర్శిస్తుండడం వల్ల ఉద్యోగులు ఇళ్లలో ఎక్కువ రోజులు పనిచేయడానికి మానసికంగా అంగీకరించడం లేదు. ముఖ్యంగా భార్యభర్తలిద్దరూ ఐటీ ఉద్యోగులైతే వీలైనంత త్వరగా పర్యటక ప్రాంతాలకు వెళదామని చూస్తున్నారు. ఇక తాము వెళ్లిన ప్రాంతంలో ఆహారానికి కూడా ఎక్కువ ఖర్చు కాకపోవడం ఈ సంస్కృతిని మరింతగా ప్రోత్సహిస్తోంది. ఉదాహరణకు జోస్టెల్‌ అనే హాస్టల్‌లో నెల పాటు ఉంటే రూ.10వేలు బసకు, రూ.5వేలు ఆహారానికి తీసుకుంటున్నారు. మనం ఇంట్లో ఉన్నాగానీ, మనిషికి రూ.5వేలు ఆహారానికి తప్పనిసరిగా వెచ్చించాల్సి వస్తుండడంతో ఖర్చును పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. వర్కోకేషన్‌కి వెళ్లేటప్పుడు రైస్‌కుక్కర్‌, మన పచ్చళ్లు, పొడులు కూడా తీసుకెళ్లే వారు కూడా లేకపోలేదు. ముఖ్యంగా వెజిటేరియన్స్‌ ఈ విధంగా తమ ఆహారాన్ని తామే వండుకుంటూ నెలవారీ ఖర్చు కూడా తగ్గించుకుంటున్నారు. ఇందుకు వారు అక్కడి హోంస్టేలను ఎంచుకుంటున్నారు.

నచ్చిన చోట విధులు

హిమాలయ పర్వతాల్లో.... కశ్మీర్‌ దాల్‌ సరస్సు సమీపంలోనే కూర్చొని కార్యాలయ పని చేసుకోవడమే కాదు. వారాంతాల్లో పరిసర ప్రాంతాలను కూడా చుట్టివచ్చే అవకాశం ఉండడం వల్ల ఈ సంస్కృతి వైపు ఎక్కువమంది ఆకర్షితులు అవుతున్నారు. ఒక నెల కశ్మీర్‌లోనూ, ఒక నెల జైపూర్‌, ఒక నెల గోవాలో ఉంటే మన సొంత ఊళ్లో ఉన్నంతగా ఆ ప్రాంతాన్ని చుట్టివచ్చే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా సెలవులకు ఆయా ప్రాంతాలకు వెళితే హడావుడిగా వారం రోజుల్లో ఆ ప్రాంతమంతా చూసి వచ్చేయాల్సి ఉండగా ఈవర్కోకేషన్‌ విధానంలో అయితే స్థానికంగా ద్విచక్ర వాహనం రోజుకు రూ.400కు అద్దెకు తీసుకుని మన సొంత ఊళ్లో తిరిగినట్లు తిరగొచ్ఛు తద్వారా స్థానిక సంస్కృతిని, సంప్రదాయాలను కూడా దగ్గరి నుంచి చూసే అవకాశం ఉంటుంది. ప్రపంచానికి కరోనా చేసిన హాని అనంతమైనా కష్టాలలో కూడా సుఖాన్ని వెతుక్కునే మనస్తత్వం ఉన్నవారు మాత్రం ఇటువంటి వినూత్న ఆలోచనలతో తమ పనితనాన్ని మరింతగా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

కొవిడ్‌ భయం లేకుండా జాగ్రత్తలు..

కరోనాతో గత ఏడాది మార్చి నుంచి ఇంటి నుంచే పని చేస్తున్నాం. గుంటూరులో ఉన్నా కరోనా వల్ల ఇంటి నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి. ఇంటి నుంచి పనిచేయడం వల్ల పని ఒత్తిడి బాగా పెరిగింది. ఈ క్రమంలో కర్ణాటకలోని కూర్గ్‌లో నెల రోజుల ప్యాకేజీ తీసుకుని అక్కడి నుంచి పనిచేశాం. వసతితోపాటు భోజనం కూడా వారే ఏర్పాటు చేశారు. నెలకు రూ.20వేలు చొప్పున చెల్లించాం. కరోనా కట్టడికి అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన గదులు ఉన్నాయి. వారాంతాల్లో ట్రెక్కింగ్‌, పరిసర ప్రాంతాల సందర్శనకు రిసార్ట్‌ వాళ్ల వాహనాలు అందుబాటులో ఉంటాయి. అక్కడ పనిచేసే సిబ్బంది ఒక్కరు మాత్రమే బయటికి వెళ్లి అవసరమైన సామగ్రి తెస్తుంటారు. శానిటైజేషన్‌, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా భయం లేదు. భద్రతా పరంగా ఎక్కడా ఇబ్బంది లేదు. దీంతో ఎక్కువమంది అక్కడి వచ్చి పనిచేసుకుంటున్నారు. వారాంతాల్లో నచ్చిన ప్రదేశాలు చూస్తూ విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది.

- అపరంజి, ఎస్వీఎన్‌ కాలనీ, గుంటూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని