తల్లి ఒడి... పిల్లల బడి
logo
Published : 14/06/2021 04:14 IST

తల్లి ఒడి... పిల్లల బడి

ఇంట్లోనే పూర్వ ప్రాథమిక విద్య
అమరావతి ఫీచర్స్‌, విద్యాధరపురం, న్యూస్‌టుడే

కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో చిన్నారులు బడి ముఖం చూడకుండానే ఒక ఏడాది గడిచిపోయింది. వచ్చే విద్యా సంవత్సరంలోనూ నర్సరీ నుంచి రెండో తరగతి వరకు చదువులు ముందుకు సాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. కరోనా మొదటి దశలోనే కొందరు తల్లులు గురువు పాత్రను కూడా సమర్థంగా పోషించారు. మూడో దశ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే హెచ్చరికల నేపథ్యంలో వారిని చదివించే గురుతర బాధ్యత తల్లులు తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లల్ని చదువు పట్ల ఆకర్షింపజేయడానికి పలకా బలపంతో కాకుండా ఆట పాటలతో బోధన కొనసాగించాలని బోయపాలెం డైట్‌ మనోవికాస నిపుణులు డాక్టర్‌ సుగంధరావు సూచించారు.
అక్షరాలు దిద్దించడం ఒక ఎత్తయితే వాటిని గుర్తుపట్టే సామర్థ్యం పిల్లల్లో పెంపొందించాలి. అక్షరాలు, అంకెల ఉచ్ఛారణ పద్ధతిగా నేర్పాలి.
మార్కెట్‌లో అక్షరాలు, అంకెలకు సంబంధించిన ఆట బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. వాటితో విద్యాబుద్ధులు నేర్పించవచ్చు.
యూట్యూబ్‌లో అంకెలతో పాటు ఆకారాలను ఒకటో తరగతిలో పద్యాలు, ఆంగ్ల మాధ్యమంలోని రైమ్స్‌ను దగ్గరుండి చూపించాలి.

ఆన్‌లైన్‌ చదువులు చిన్నారులకు కుదరవు: వేలాది రూపాయల ఫీజులు చెల్లించడంతోపాటు అదనంగా ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోను తీసుకోవడం మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక భారంగా మారుతోంది. ఇంత ఖర్చుపెట్టినా ఆన్‌లైన్‌ చదువులు అర్థం కాక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులే గురువులుగా మారాల్సి వస్తోంది. వాళ్లు మారాం చేసినా, ఓపికగా అన్నీ చెప్పాలి.

- శిరీష, నాలుగు స్తంభాల సెంటరు, విజయవాడ

విద్యావిధానంలో మార్పు రావాలి: కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక విద్యావిధానంలో మార్పు రావాలి. చిన్నారులు చదివి అర్థం చేసుకునే అవకాశం లేనందున డిజిటలైజేషన్‌ విధానంలో చిత్రాల రూపంలో చిన్నారులకు ఆసక్తి కలిగేలా రూపొందించాలి. పిల్లలు పాఠశాలకు వెళితేనే వారు అన్నీ గుర్తుంచుకుంటారు. ప్రస్తుతం అన్నీ మర్చిపోయారు. ఈ నేపథ్యంలో తల్లి ఒడే వారికి బడి కావాలి. 

- అంజలి, క్వారీ సెంటరు

మానసిక ఒత్తిడి లేకుండా..: కొవిడ్‌ పరిస్థితుల్లో చిన్నారులపై మానసిక ఒత్తిడి లేకుండా చూడాలి. ముఖ్యంగా ఐదో తరగతి లోపు విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పినా, వాటిని అర్థమయ్యే విధంగా తల్లిదండ్రులు మళ్లీ చెప్పాలి. విసుక్కోకుండా, వారి అనుమానాలను నివృత్తి చేయాలి.  

- లక్ష్మి, చెరువు సెంటరు 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని