సరిహద్దులో... ఆదివారమూ అదే రద్దీ
logo
Updated : 14/06/2021 05:44 IST

సరిహద్దులో... ఆదివారమూ అదే రద్దీ

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దులో రామాపురం అడ్డరోడ్డు చెక్‌పోస్ట్‌ వద్ద ఆదివారం కూడా వాహనాల రద్దీ కొనసాగింది. శనివారం కూడా భారీగా వాహనాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆదివారం సెలవు కావడంతో అధిక సంఖ్యలో వాహనాలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాయి. సరిహద్దుల్లో ఈ-పాస్‌ నిబంధనను తెలంగాణ పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలో వాహనాలు బారులు తీరాయి. ప్రత్యేక కౌంటర్లలో ఈ-పాస్‌ కోసం అర్జీ పెట్టుకొని, అధికారులు అనుమతి మంజూరు చేసే వరకు వాహనదారులు పడిగాపులు కాశారు. మధ్యాహ్నం వరకూ రద్దీ కొనసాగింది.

రైతుల వాహనాల అడ్డగింత

నందిగామ గ్రామీణం: తెలంగాణ పోలీసులు ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి వాహనాలను తమ రాష్ట్రంలోకి అనుమతించకపోవడంతో వాహనదారులు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన జొన్నలగడ్డ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ పోలీసులు తెలంగాణ వాహనాలను ఆంధ్రాలోకి అనుమతిస్తున్నారు. కానీ ఏపీ నుంచి ఖమ్మం జిల్లా మధిరకు తెలంగాణ పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. జొన్నలగడ్డ రైతులకు తెలంగాణ సరిహద్దు గ్రామాలైన దేశినేనిపాలెం, రాయపట్నం పరిసరాల్లో పొలాలున్నాయి. ఆ రైతులను కూడా పోలీసులు వెళ్లనివ్వలేదు. స్థానిక తెదేపా నాయకుడు లగడపాటి బాబీ మధిర పోలీసులతో మాట్లాడారు. తమ గ్రామం నుంచి మధిర ఆసుపత్రులకు, పొలాలకు అనేక మంది రాకపోకలు సాగించడం తప్పనిసరి కనుక పంపించాలని కోరారు. మధిర రెడ్‌జోన్‌లో ఉన్నందున ఎవరినీ అనుమతించమని, ఈ-పాస్‌ ఉంటేనే పంపిస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. నందిగామ ఎస్సై జి.రామకృష్ణ వచ్చి తెలంగాణ పోలీసులతో మాట్లాడిన తరువాత ఆంధ్రా వాహనాలను మధిరకు అనుమతించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని