ఒకవైపు కష్టం.. మరోవైపు నష్టం
logo
Published : 14/06/2021 04:23 IST

ఒకవైపు కష్టం.. మరోవైపు నష్టం

కొవిడ్‌ బాధితుల ఇంట్లో చోరీ

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: కొవిడ్‌తో ఇంటి యజమాని మృతి చెందారు. ఆయన కుమారుడు వైరస్‌ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు ఆయా పనులపై వేరే ప్రాంతంలో ఉండగా వారి ఇంట్లో చోరీ జరగడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని నాగార్జునానగర్‌కు చెందిన వాస్తు సిద్ధాంతి రామచంద్రుల సుబ్రహ్మణ్యశాస్త్రి (63) అలియాస్‌ గుడిపూడి సిద్ధాంతికి పక్షం రోజుల కిందట కరోనా సోకింది. 12 రోజుల క్రితం విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. తండ్రికి సహాయంగా ఉంటూ ఆయన కుమారుడు వారం రోజుల కిందట వైరస్‌ బారిన పడటంతో అదే ఆసుపత్రిలో చేరారు. 10 రోజుల పాటు సుబ్రహ్మణ్యశాస్త్రికి అందించిన వైద్య సేవలకు రూ.10 లక్షలకు పైగా ఖర్చయ్యాయి. ఆరోగ్యం కుదుటపడుతోందని.. కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. ఈ నెల 11న గుండెపోటుతో సిద్ధాంతి మృతి చెందారు. తండ్రి మృతి విషయాన్ని అదే ఆసుపత్రిలో ఉన్న కుమారుడికి చెప్పలేదు. ఇంటి వద్దకు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేయడం కష్టమని భావించి బంధువుల సహకారంతో విజయవాడలోనే ఆ కార్యక్రమం పూర్తి చేసేందుకు కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని తెలుసుకున్న దొంగలు అదే రోజు రాత్రి చోరీకి పాల్పడ్డారు. నగదుతో పాటు సుమారు రెండు కిలోల వెండి, బంగారు వస్తువులు అపహరించారు. అన్నీ కలిపి రూ.ఎనిమిది లక్షల వరకు విలువ ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. వారు వచ్చి చూసే సరికి ఇంట్లో విలువైన వస్తువులన్నీ కనిపించలేదు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్సై ఎ.రఘుపతిరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీ అయిన వస్తువుల వివరాలు, పలు ఆధారాలు సేకరించారు. అదే కాలనీలో మరో ఇద్దరు ఉపాధ్యాయుల ఇళ్లల్లోనూ చోరులు హస్తలాఘవం ప్రదర్శించారు. వారు పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని, ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సీఐ విజయచంద్ర సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని