కరోనా బాధితుల కన్నీటి వ్యధలు
logo
Published : 16/06/2021 02:59 IST

కరోనా బాధితుల కన్నీటి వ్యధలు

 

ఈనాడు, అమరావతి

కరోనాతో పలు కుటుంబాల ఆర్థిక పరిస్థితి తల్లకిందులు అయింది. రూ.లక్షలు ఖర్చు చేసినా కొంత మంది ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు మినహా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు.. కనీసం రూ.2.5లక్షలు ఖర్చు లేకుండా బయటపడలేదు. గరిష్ఠంగా రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు వెచ్చించిన వారు ఉన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు కొంత తట్టుకున్నా ఎక్కువ మంది ఆస్తులను తనఖా పెట్టుకోవడం, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం, అమ్ముకోవడం లాంటివి చేశారు. మధ్యతరగతి, నిరుపేదల వద్ద అంత సొమ్ము నిలువ ఉండదు. ఎగువ మధ్య తరగతి వారు పొదుపు చేసుకున్న సొమ్మును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. ఆడపడుచు కింద ఇచ్చిన పొలాలు తాకట్టు పెట్టుకున్నారు. అమ్మాయి పెళ్లికి, ఇతర ఖర్చులకు దాచుకున్న సొమ్మును ఖర్చు చేశారు. నిరుపేదలు అయితే రూ.2 చొప్పున వడ్డీకి తెచ్చి వైద్యానికి ఖర్చు చేశారు. అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాలు కొన్ని నగరంలో రూ.5 చొప్పున వడ్డీకి తెచ్చుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 6,500 పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి. వీరిలో 3వేల మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి కోలుకున్నా కొందరిని బ్లాక్‌ఫంగస్‌ వెంటాడుతోంది.

మైలవరానికి చెందిన వివాహితకు మొదట కరోనా సోకింది. విజయవాడలో రెండు ఆసుపత్రులకు తిప్పారు. రూ.లక్షల్లోనే ఖర్చు అయింది. 30రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకున్నారు. తర్వాత బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో ఉన్నారు. కరోనా చికిత్సకు దాదాపు రూ.17 లక్షల వరకు ఖర్చు అయింది. ఆరోగ్యశ్రీ రాలేదు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నారు. భర్త ఓ ప్రైవేటు సంస్థలో చిరుద్యోగి. తల్లిదండ్రులు ఇచ్చిన పొలం రామచంద్రాపురంలో ఉంది. దాన్ని అప్పుల కింద బేరం పెట్టారు. వీరికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.

ఆయన విజయవాడ నగరం అయోధ్యనగర్‌కు చెందిన అర్చకులు. కరోనా ఆయన కుటుంబాన్ని తల్లకిందులు చేసింది. ముందుగా ఆయన తండ్రికి సోకింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వారం తర్వాత మరణించారు. తర్వాత తల్లికి వైరస్‌ సోకింది. తండ్రి మరణించిన 5 రోజులకే తల్లి కన్నుమూసింది. తన భార్యకు, తనకు కరోనా సోకింది. వారు చికిత్స తీసుకుని బయటపడ్డారు. అంతా కలిపి రూ.8లక్షలు పైగా ఖర్చు అయింది. ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి ఈ వైద్య ఖర్చులను అధిగమించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ సమయంలో పడకలు కూడా లభించలేదు. ఇతర ఆస్తులు ఏవీ లేవు. ఒకవైపు ఆస్పత్రుల్లో తల్లిదండ్రులు మృత్యువుతో పోరాటం.. మరోవైపు నగదు కోసం మనోవేదనకు గురయ్యారు.

పాతూరి రాంబాబు ఓ సంస్థలో ఒప్పంద ఉద్యోగి. నెలలో కొన్ని రోజులు మాత్రమే విధులు ఉంటాయి. ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఎక్కడా పడకలు లభించలేదు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. రూ.2.5 లక్షలు ఖర్చు అయింది. తన భార్య బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి ఆస్పత్రి బిల్లు చెల్లించారు. తన భార్య మెడలో తాళి సైతం తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉయ్యూరుకు చెందిన వీరంకి స్వామి. సెంట్రింగ్‌ మేస్త్రీగా పనులు చేస్తారు. ఇద్దరు పిల్లలు. కరోనా సోకింది. నిరుపేద. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంత ప్రయత్నం చేసినా పడక లభించలేదు. విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు రూ.6లక్షలు ఖర్చు అయింది. అయినా మనిషి దక్కలేదు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత బంగారం తాకట్టు పెట్టారు. కొంత తెలిసిన వారి దగ్గర వడ్డీకి తెచ్చారు. ప్రస్తుతం ఎలా తీర్చాలో అంతుచిక్కని విషయం. ఆరోగ్యశ్రీ కూడా వర్తింప చేయలేదు.

జిల్లాలో మొత్తం కరోనా రోగులు 96,316

కోలుకుని ఇంటికొచ్చినవారు 89,024

మరణించిన వారు 1041


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని