వాహన మిత్ర పథకం.. 26,358 మందికి రూ.26.35 కోట్లు జమ
logo
Published : 16/06/2021 02:59 IST

వాహన మిత్ర పథకం.. 26,358 మందికి రూ.26.35 కోట్లు జమ


వాహన మిత్ర చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యేలు వసంత, జోగి, మల్లాది, కలెక్టర్‌ నివాస్‌ తదితరులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : వై.ఎస్‌.ఆర్‌.వాహన మిత్ర పథకం ద్వారా ఆటో, ట్యాక్సీ తదితర వాహనాల డ్రైవర్లు/యజమానులకు రూ.10 వేల చొప్పున ఇప్పటికి మూడు విడతలుగా సాయం అందించినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత వాహన మిత్ర సొమ్ము జమ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. నగరంలోని కలెక్టర్‌ విడిది కార్యాలయంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కొడాలి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వాహన మిత్ర పథకం అమలవుతోందని తెలిపారు. కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ.. 26,358 మంది లబ్ధిదారులకు రూ.26.35 కోట్లు అందించినట్టు తెలిపారు. గత ఏడాది 24,253 మంది లబ్ధిదారులు ఉండగా, కొత్తగా 4,622 మంది దరఖాస్తు చేసినట్టు పేర్కొన్నారు. పరిశీలన అనంతరం లబ్ధిదారుల సంఖ్య 26,358కు చేరినట్టు వివరించారు. ఆటో డ్రైవర్లు పి.ప్రశాంతి, దాసరి నాగేశ్వరరావు, ఎం.శ్రీనివాస్‌, బి.దుర్గాప్రసాద్‌, అప్పారావు తదితరులు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ సాయం తమను ఆదుకుంటోందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎం.డి.కరీమున్సీసా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌, వసంత కృష్ణ ప్రసాద్‌, శిక్షణ కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక, ఉప రవాణా కమిషనరు ఎం.పురేంద్ర, ఆర్టీవోలు కె.రామ్‌ప్రసాద్‌, ఎ.విజయసారథి, ఎంవీఐలు వి.వి.మురళీకృష్ణ, కె.ఆర్‌.రవికుమార్‌, జి.నాగమురళీ, అజ్మీరాబసు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని