ఇంజినీరింగ్‌ చదివి.. కోళ్ల పందేల నిర్వాహకుడిగా మారి..
logo
Published : 16/06/2021 02:59 IST

ఇంజినీరింగ్‌ చదివి.. కోళ్ల పందేల నిర్వాహకుడిగా మారి..


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ దుర్గాప్రసాద్‌. వెనుక నిందితులు

పెదకాకాని, న్యూస్‌టుడే: మండల పరిధిలోని నంబూరు పొలిమేరలో ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేసి, భారీఎత్తున కోడిపందేలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు మంగళవారం దాడిచేసి, 12 మందిని పట్టుకొని, రూ.2.96 లక్షల నగదు, 44 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన శనగల బలరామిరెడ్డి జూదం, కోడిపందేలకు బానిసగా మారాడు. గ్రామ పోలిమేరలో పాకలు నిర్మించి, వాటి ముందున్న ఖాళీ స్థలం చుట్టూ పరదాలు కట్టి, పందెం కోళ్లను పెంచుతున్నాడు. గుట్టుగా ఇక్కడే పందేలు కూడా నిర్వహిస్తున్నాడు. వీటిలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వ్యసనపరులు చేరుకుని భారీ మొత్తాల్లో పందేలు కాస్తున్నారు. పోలీసులు జరిపిన దాడిలో ఇక్కడ మద్యం అక్రమ విక్రయాలూ సాగుతున్నట్టు గుర్తించారు. వారు అదుపులోకి తీసుకున్న వారిలో నంబూరు, కొల్లిపర, మంగళగిరి, చిలకలూరిపేట, నరసరావుపేట ప్రాంతాలకు చెందిన వారే కాకుండా, ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన వారూ ఉన్నారు. సమావేశంలో సీఐ సురేష్‌బాబు, ఎస్సై వినోద్‌కుమార్‌, పీఎస్సై కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని