‘అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే పోరాటానికి సిద్ధం’
logo
Published : 16/06/2021 02:59 IST

‘అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే పోరాటానికి సిద్ధం’


మాట్లాడుతున్న నక్కా ఆనందబాబు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు సంస్థ ఇసుక డంపింగ్‌ చేస్తే ప్రజలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇసుక, మద్యం, గనులు, భూములు.. ఇలా అన్నింటిలో గతంలో ఎన్నడూ లేనంతంగా అవినీతి పెరిగిపోయింది. ఇసుకను జేపీ వెంచర్స్‌ అనే దివాళా తీసిన సంస్థకు కట్టబెట్టారు. ఇది జగన్‌ బినామీ కంపెనీ. తెదేపా హయాంలో రూ.1000 ఉన్న ట్రక్కు ఇసుక ఇప్పుడు రూ.6000కు అమ్ముకుంటున్నారు. రైతులకు ఉపయోగించాల్సిన వేమూరు మార్కెట్‌ యార్డులో ఆకాశమంత ఎత్తులో లక్షల టన్నులు డంప్‌ చేశారు. ప్రహరీని కూడా కూల్చి ఇసుక నిల్వలను కుప్పలుగా పోశారు’.. అని ధ్వజమెత్తారు. ‘దోనేపూడిలో జిల్లా పరిషత్‌ ఆట స్థలాన్ని డంపింగ్‌ యార్డుగా మారుస్తుంటే స్థానికులు అడ్డుపడ్డారు. కేసులు పెట్టి మీ అంతు చూస్తామని యువకులపై జేపీ వెంచర్స్‌ సిబ్బంది దౌర్జన్యం చేశారు. జేపీ వెంచర్స్‌ను ఎవరు అడ్డుకున్నా కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇసుకను డంప్‌ చేస్తే ఊరుకోవాలా? అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. ప్రైవేటు కేసులు పెడతాం. ప్రణాళిక రూపొందించి స్థానికులతో కలిసి పోరాటం చేస్తాం’.. అని చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్యకు ప్రభుత్వం చూపించే లెక్కలకు పొంతన లేదని విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని