జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు సాగేనా?
logo
Published : 16/06/2021 03:39 IST

జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు సాగేనా?

టెండర్లు వేసేందుకు గుత్తేదారుల అనాసక్తి

120 పనులకు టెండర్లు రాలేదాయె

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే

దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు రక్షిత తాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం)ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం- పారిశుద్ధ్య మిషన్‌ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇంటింటికీ తాగునీటి కుళాయి కనెక్షన్‌ ఇచ్చేలా పనులను గుర్తించి టెండర్లు ఆహ్వానించగా గుత్తేదారుల నుంచి సరైన స్పందన లేదు. ఇప్పటికి మూడు సార్లు టెండర్లు పిలిస్తే కొందరు స్పందించి టెండర్లు వేశారు. ఎక్కువ మంది ఆసక్తి చూపడంలేదు. ఈ పరిస్థితుల్లో జేజేఎం పనులు ఎలా ముందుకు తీసుకెళ్లాలో అని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొవిడ్‌ కారణంగా ఆర్థిక మాంద్యం నెలకొంది. రూ.కోట్లలో పనులు చేసేందుకు నిధుల సమీకరణ గుత్తేదారులకు సమస్యగా మారింది. బయట అప్పులు తీసుకొచ్చి టెండరు వేసి దక్కించుకున్న తర్వాత చేసిన పనులకు బిల్లులు సకాలంలో మంజూరవుతాయో.. లేదో.. తెలియని పరిస్థితి. దీనిని దృష్టిలో పెట్టుకుని గుత్తేదారులు టెండర్లు వేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.

జిల్లాలో 2021-22 సంవత్సరంలో 420 పనులను రూ.350 కోట్ల విలువతో టెండర్లు పిలిచారు. 300 పనులకు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేశారు. మరో 120 పనులకు ఒక్కటీ రాలేదు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మూడు సార్లు పిలిచినా స్పందించలేదు. అధికారులు రిజిస్టర్డ్‌ గుత్తేదారులతో టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి ఈ ప్రక్రియలో పాల్గొనాలని కోరగా కొందరు గుత్తేదారులు సంసిద్ధత తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,22,476 ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇప్పటికే ఆర్థిక ఏడాదిలో రెండున్నర నెలలు గడిచిపోయాయి. టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో లక్ష్యాన్ని చేరుకోవడంపై అధికారులపై ఒత్తిడి మొదలైంది. 2023-24 సంవత్సరానికి జిల్లాలో మొత్తం 5.22 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. 2020-21 సంవత్సరంలో 28 వేల గృహాలకు (27 శాతం మందికి) కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. మూడేళ్లలో మరో 4,94,000 గృహాలకు ఇవ్వాలి. గుత్తేదారులు జల్‌ జీవన్‌ మిషన్‌లో పనులు చేసేందుకు ముందుకు రాకపోతే నిర్ణీత గడువు లోపు గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం సాధ్యం కాదు. టెండర్లు దాఖలు చేసిన 300 పనులకు సంబంధించి పైపు లైన్లు వేసి పనులు ప్రారంభింపజేసేందుకు గుత్తేదారులకు పరిపాలన అనుమతులు ఇవ్వనున్నారు. సురక్షిత తాగునీటిని ప్రజలకు అందజేసేందుకు జల్‌ జీవన్‌ మిషన్‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. స్థానికంగా నీటి వనరులు ఉన్న చోట్ల రక్షిత తాగునీటి పథకాలను నిర్మించి అక్కడి నుంచి సమీపంలోని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాలనేది ప్రణాళిక. ఇందులో గుత్తేదారులు కీలక పాత్ర పోషించాలి. వారు టెండర్లు వేస్తేనే గాని పనులు చేయడానికి వీల్లేదు. కరోనా పరిస్థితుల్లో గుత్తేదారులు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు చేసేందుకు వెనుకాడుతున్నారు. కరోనా రెండో దశ ఎప్పటికి ముగుస్తుందో? మూడో దశ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి. సాధ్యమైనంత వరకు పనులు ప్రారంభించేలా చూడాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్థిక ఏడాది వారీగా లక్ష్యం: సురేష్‌, జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ పర్యవేక్షక ఇంజినీర్‌

జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామాల్లోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆర్థిక ఏడాదుల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులు చేస్తున్నాం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 31 శాతం లక్ష్యాన్ని పెట్టుకున్నాం. 2021-21లో 69 శాతం, 2022-23లో 84 శాతం, 2023-24 నాటికి 100 శాతం మందికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఆ మేరకు ఆయా ఆర్థిక ఏడాదుల్లో పనులను ఎంపిక చేసి టెండర్లు పిలుస్తున్నాం. ప్రస్తుత ఏడాదిలో 420 పనులకు టెండర్లు పిలవగా 120 పనులకు ఎవరూ ముందుకు రాలేదు. మిగిలిన 300 పనులను ప్రారంభింపజేస్తున్నాం. కొవిడ్‌ పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి తొలగిపోయిన తర్వాత దశల వారీగా జేజేఎం పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది ప్రణాళికను రూపొందించుకుని విధులు నిర్వహిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని