వైద్య సేవలపై ప్రతి వారం సమీక్ష: కలెక్టర్‌
logo
Published : 16/06/2021 03:39 IST

వైద్య సేవలపై ప్రతి వారం సమీక్ష: కలెక్టర్‌


సమావేశంలో కలెక్టర్‌ జె.నివాస్‌, జేసీలు ఎల్‌.శివశంకర్‌, మోహన్‌కుమార్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.సుహాసిని

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: జీజీహెచ్‌లో అందుతున్న సేవలు, వైద్యుల పనితీరుపై ప్రతి వారం సమీక్ష చేస్తానని కలెక్టర్‌ జె.నివాస్‌ పేర్కొన్నారు. జేసీ ఎల్‌.శివశంకర్‌తో కలిసి మంగళవారం సాయంత్రం విజయవాడ జీజీహెచ్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న ప్రతి రోగి వద్దకు డాక్టర్‌ వెళ్లాలని చెప్పారు. మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా అందరూ పని చేయాలని కోరారు. ప్రతి 10మంది రోగులకు ఒక డాక్టరు, ప్రతి పదిమంది రోగులకు ఒక నర్సు ఉండాలని సూచించారు. ఎంతమంది స్వయంగా రోగులను కలిసి వారితో మాట్లాడి, చికిత్స అందిస్తున్నారని కలెక్టర్‌ ప్రశ్నించారు. అన్ని వైద్య విభాగాల్లోనూ అందుతున్న సేవలను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఇందులో రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, డ్యూటీ డాక్టర్లకు అవసరమైన సహకారాన్ని అందించాలని చెప్పారు. ఎంత మందికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు చేశారు?, ఎంత మందికి స్టెరాయిడ్స్‌ ఇచ్చారు...? అని అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల చికిత్సపై ఆరా తీశారు. డ్యూటీ రోస్టర్‌లో ప్రతి డాక్టర్‌ ఫోన్‌ నెంబర్‌, ఏ సమయంలో, ఏ వార్డులో పని చేస్తున్నారనేది పూర్తి స్థాయి సమాచారం ఉండాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో అదనంగా జనరల్‌ డ్యూటీ డాక్టర్లను త్వరలో నియమించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన వైద్యపరికరాలు సమకూరుస్తామని తెలిపారు. ఇప్పటి వరకు కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సంయుక్తంగా పోరాడామని, మూడోదశ పరిస్థితులపై కూడా ఇప్పటి నుంచే అవసరమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.సుహాసిని, జేసీ మోహన్‌కుమార్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శివశంకర్‌, అదనపు సూపరింటెండెంట్‌ విఠల్‌ రావు, హెచ్‌ఓడీలు, వైద్యులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని