త్వరలో జాతీయ రహదారికి హరిత శోభ
logo
Updated : 16/06/2021 04:39 IST

త్వరలో జాతీయ రహదారికి హరిత శోభ


నాటడానికి సిద్ధంగా ఉంచిన మొక్కలు

కంకిపాడు, న్యూస్‌టుడే: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి త్వరలో హరిత శోభ సంతరించుకోనుంది. ఈ రహదారి విస్తరణ, అభివృద్ధిలో భాగంగా సుమారు 60 కిలోమీటర్ల మేర ఇరువైపులా ఉన్న వేలాది వృక్షాలను ఐదేళ్ల కిందట తొలగించారు. 95 శాతం మేర పనులు పూర్తయి రెండేళ్లయింది. ఏడాదిన్నరగా కంకిపాడు-ఉయ్యూరు మధ్యన టోల్‌గేట్‌ రుసుం కూడా వసూలు చేస్తున్నాయి. తొలగించిన వృక్షాలకు ప్రత్యామ్నాయంగా మొక్కలను నాటి సంరక్షించాల్సిన బాధ్యత గుత్తేదారు, ఎన్‌హెచ్‌ సంస్థపై ఉంది. డివైడర్‌పై మొక్కలు నాటడం, నిర్వహణ లోపంతో ఎండిపోవడం పరిపాటైంది. దీనిపై సంబంధిత అధికారులు గుత్తేదారుకు తాఖీదులు జారీ చేయడంతో డివైడర్లపై మరోసారి కాగిత పూల మొక్కలు నాటారు. కొన్నిచోట్ల ఏపుగానే పెరిగాయి. సారవంతమైన మట్టికి బదులుగా రాళ్లతో కూడిన రబ్బీష్‌ వ్యర్థాలను పోయడంతో మరికొన్ని ప్రదేశాల్లో నాటిన మొక్కల్లో పెరుగుదల కుంటుపడుతోంది. ఈ సమయంలో పెరిగిన కలుపు తొలగింపు, నాటిన మొక్కల సంరక్షణపై తొలి దశలో శ్రద్ధ చూపలేదు. గతంలో అక్కడక్కడ అంచుల్లోనూ వృక్షాలుగా పెరిగే మొక్కలు నాటారు. వీటినీ సంరక్షించలేదు. మరికొద్ది నెలల్లో గుత్తేదారుతో ఒప్పందం పూర్తి కానుంది. అంచుల్లో మొక్కల పెంచాల్సిన బాధ్యతను మరోసారి గుర్తు చేశారు. ఈ మేరకు కానూరు-మచిలీపట్నం (వయా కంకిపాడు, ఉయ్యూరు, మంటాడ, పామర్రు, గూడూరు) వరకు రెండు వైపులా అంచుల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిలో భాగంగా కంకిపాడు సమీపం దావులూరు టోల్‌ప్లాజా వద్ద వేలాది వేప, దిరిశన, గోల్డ్‌ మొహర్‌, పిచ్చి కరక్కాయి, రావి తదితర రకాల మొక్కలను సిద్ధంగా ఉంచారు. వీటి ఆకులను పశువులు తినవని చెబుతున్నారు. త్వరితగతిన పెరిగే జాతులకు చెందినవి. మొక్కలు ఆరేడు అడుగుల ఎత్తున ఉన్నాయి. వర్షాకాలంలో ఇవి 12 నుంచి 15 అడుగుల ఎత్తుకు పెరిగే అవకాశం ఉంది. సమగ్ర సంరక్షణ చర్యలు తీసుకుంటే.. వచ్చే వేసవికి ప్రయాణికులకు నీడ, చల్లని గాలిని ఇచ్చే చెట్లుగా అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని