మంజూరు రూ.294.41 కోట్లు.. ఖర్చు రూ.133.16 కోట్లు
logo
Published : 16/06/2021 03:39 IST

మంజూరు రూ.294.41 కోట్లు.. ఖర్చు రూ.133.16 కోట్లు

పట్టణాల్లో 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం తీరు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే


మూడేళ్ల క్రితం భూమి పూజ చేసినా పూర్తి కాని సీసీ రోడ్డు నిర్మాణం

నిధులు లేక అభివృద్ధి జరగకపోవడం సాధారణంగా చూస్తుంటాం. ఇక్కడ నిధులు ఉండీ వాటిని సద్వినియోగం చేయడంలో జాప్యం విమర్శలకు తావిస్తోంది. గుంటూరు నగరం, మిగిలిన పట్టణాల్లో 14వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపునకు, వినియోగానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. 15వ ఆర్థిక సంఘం మొదలై ఏడాదైనా ఇప్పటివరకు 14వ ఆర్థిక సంఘం నిధులు వ్యయం కాలేదు. వచ్చే ఏడాది మార్చి వరకే నిధుల సద్వినియోగానికి అవకాశం ఉంది. ఐదేళ్ల వ్యవధిలో అభివృద్ధి పనులకు రూ.294.41 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.133.16 కోట్లు ఖర్చు చేశారు.

ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల్ని స్థానిక సంస్థలకు కేటాయిస్తుంది. 2015-16 నుంచి 2019-20 వరకు ఎనిమిది విడతల్లో జిల్లాకు రూ.294.41 కోట్లు మంజూరయ్యాయి. గుంటూరు నగరపాలక సంస్థకు 2015-16, 2017-18లో రూ.39.92 కోట్లు మంజూరయ్యాయి. ఎన్నిక జరగకపోవడంతో 2017-18 నుంచి 2019-20 వరకు నిధులు మంజూరవ్వలేదు. మిగిలిన 12 పట్టణాలకు ఐదేళ్ల పాటు నిధులు విడుదలయ్యాయి. రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా, సామాజిక భవనాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, పార్కులు, మౌలిక వసతుల కల్పన పనులకు వినియోగించుకోవచ్ఛు

* 1,659 పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,013 పూర్తయ్యాయి. ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగంలో మంగళగిరి పురపాలక సంఘం మెరుగైన పని తీరు ప్రదర్శించింది. జనాభా అధికంగా ఉన్న తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేట పట్టణాల్లో ప్రగతి తక్కువగా ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులతో ప్రారంభించిన పనుల్ని వెంటనే పూర్తి చేయాలని కమిషనర్లకు ఆదేశాలు చేసినట్లు పురపాలక శాఖ ఆర్డీ జి.శ్రీనివాసరావు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఖర్చు చేయాల్సి ఉన్నందున అపరిష్కృత పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని సూచించారు. నిధుల సద్వినియోగంలో నిర్లక్ష్యం చూపితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని