వ్యక్తిగత గొడవలే ప్రాణం తీయించాయ్‌
logo
Published : 18/06/2021 02:38 IST

వ్యక్తిగత గొడవలే ప్రాణం తీయించాయ్‌

తెనాలి హత్య కేసులో నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ స్రవంతిరాయ్‌, వెనుక ముసుగుల్లో నిందితులు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: ఈనెల 12న తెనాలి చెంచుపేటలో జరిగిన తరుణ్‌కుమార్‌ హత్య కేసులో నిందితులైన అక్బర్‌, రాజశేఖర్‌, ఈశ్వర్‌చరణ్‌రెడ్డిలను అరెస్టు చేసినట్టు  డీఎస్పీ   కె.స్రవంతిరాయ్‌ గురువారం తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి, నిందితులు గతంలో మిత్రులే. తరుణ్‌కుమార్‌, అక్బర్‌ గతంలో ఒక క్రిమినల్‌ కేసులోనూ నిందితులుగా ఉన్నారు. వీరిద్దరిపై మూడో పట్టణ పోలీస్‌స్టేషన్లో రౌడీషీట్లు కూడా ఉన్నాయి. కొద్ది నెలల నుంచి వీరి నడుమ విభేదాలు వచ్చి విడిగా ఉంటున్నారు. కాగా కొద్ది రోజుల నుంచి తరుణ్‌కుమార్‌ మద్యం తాగి, అందరి ముందు అక్బర్‌ను, అతని కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతున్నారు. దీంతో పగ పెంచుకున్న అక్బర్‌, తరుణ్‌కుమార్‌తో తనకు ఎప్పటికైనా హాని ఉంటుందని భావించి, తానే అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన మిత్రులైన రాజశేఖర్‌, ఈశ్వర్‌చరణ్‌రెడ్డిల సహాయం కోరాడు. వారూ అంగీకరించడంతో పథకం ప్రకారం ఈనెల 12న సాయంత్రం ఉడా కాలనీ మీదుగా తరుణ్‌ ఒంటరిగా వెళుతున్న సమయంలో అతనిపై వేట కొడవళ్లతో దాడిచేసి, వెంటాడి విచక్షణ రహితంగా నరికి చంపారు. విచారణ చేపట్టిన మూడో పట్టణ పోలీసులు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో సీఐ కె.రాఘవేంద్ర, ఎస్సైలు విజయ్‌కుమార్‌, కలగయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని