సామాన్యులపై పన్నుల భారం సరికాదు
logo
Published : 18/06/2021 02:38 IST

సామాన్యులపై పన్నుల భారం సరికాదు

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తి పన్ను పెంపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్‌ సీహెచ్‌.బాబూరావు పేర్కొన్నారు. గుంటూరు సుందరయ్యనగర్‌, పాతగుంటూరు సచివాలయం వద్ద గురువారం ఫాక్వా ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బాబూరావు పాల్గొని మాట్లాడారు. ఆస్తి పన్ను పెంపుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే సంపూర్ణ బాధ్యత వహించాలన్నారు. కేంద్రం చేసిన సంస్కరణల వల్లే నేడు రాష్ట్ర ప్రభుత్వం పన్నులు రెట్టింపు చేసిందన్నారు. పన్నులు పెంచవద్దని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర భాజపా నాయకులు ప్రధాని మోదీకి లేఖలు రాయాలన్నారు. తెలంగాణలో ఆస్తిపన్ను వసూలు కార్యక్రమాన్ని నిలిపివేస్తే.. ఏపీలో మాత్రం పన్నుల వసూలుకు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు రాయితీ కల్పిస్తూ సామాన్యులపై పన్నుల భారం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు, వ్యాపారవేత్తలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆస్తి పన్నుల పెంపుదల విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పౌర సంక్షేమ సంఘం జిల్లా నాయకులు భావన్నారాయణ, ఫాక్వా జిల్లా కన్వీనర్‌ ఎల్‌.ఎస్‌.భారవి, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని