రూ.2 కోట్లతో ఆక్సిజన్‌ ప్లాంట్లు
logo
Published : 18/06/2021 02:56 IST

రూ.2 కోట్లతో ఆక్సిజన్‌ ప్లాంట్లు

సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల వితరణతో నిర్మాణం

రేపు ప్రారంభం


సిద్ధమైన ప్లాంట్‌ను పరిశీలిస్తున్న డాక్టర్‌ నలమాటి అమ్మన్న

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : విజయవాడ ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరతను నివారించేందుకు సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. కరోనా రెండో దశలో ప్రాణవాయువు కొరతతో తలెత్తిన ఇబ్బందులను గుర్తించిన వారు.. ప్రజల కోసం రూ.2 కోట్లతో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త ప్రభుత్వాసుపత్రిలో రూ.1.2 కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్లాంట్‌ను శనివారం ఉదయం దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. గురువారం సూర్యారావుపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిద్ధార్థ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ సూరపనేని శ్రీనివాసరావు, కార్యదర్శి డాక్టర్‌ అమ్మన్నలు ఆయా వివరాలను వెల్లడించారు.

విరాళాల వెల్లువ.. కొత్త ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ కోసం రూ.1.2 కోట్లు ఖర్చవగా, పాత ప్రభుత్వాసుపత్రిలో రూ.75 లక్షలతో మరో ప్లాంట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ మహత్కార్యం కోసం యలమంచిలి అరుణకుమారి రూ.50లక్షలు, అవంతి ఫీడ్స్‌ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్‌ రూ.25లక్షలు, అమెరికాకు చెందిన డాక్టర్‌ శ్రీలత రూ.10లక్షలు, డి.వి.ఎస్‌.రాజు రూ.5లక్షలు, డాక్టర్‌ రవికిరణ్‌ రూ.5లక్షలు, డాక్టర్‌ పర్వతనేని కృష్ణమోహన్‌ రూ.5లక్షలు, కరోనాతో మృతి చెందిన 1987-88 బ్యాచ్‌ విద్యార్థి డాక్టర్‌ దిలీప్‌ జ్ఞాపకార్థం ఆయన సహ విద్యార్థులు, ఆయన సోదరి సంయుక్తంగా రూ.8లక్షలు, అమెరికాలో స్థిరపడిన డాక్టర్‌ అమ్మణి, డాక్టర్‌ చంద్రశేఖర్‌లు ఒక్కొక్కరు 5వేల డాలర్లు చొప్పున విరాళాలు అందించారు. ప్లాంట్‌ ఏర్పాటు కోసం డాక్టర్‌ అమ్మన్న రూ.5లక్షల విరాళంతో పాటు షెడ్‌ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కోసం మరో రూ.5లక్షలు అందించారు. కొత్తాసుపత్రిలో ప్లాంట్‌ సిద్ధమై శనివారం ప్రారంభిస్తుండగా.. పాత ప్రభుత్వాసుపత్రిలో జులై మొదటి వారానికి రెండో ఆక్సిజన్‌ ప్లాంట్‌ పూర్తవుతుందని సంఘ నాయకులు వెల్లడించారు. కరోనా మూడో వేవ్‌ వచ్చినా ఆక్సిజన్‌ కొరతకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా రోజుకు 100 సిలిండర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేలా ఈ ప్లాంట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల అత్యవసర చికిత్సకు పాత ప్రభుత్వాసుపత్రిలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఉపయోగపడుతుందని డాక్టర్‌ అమ్మన్న, డాక్టర్‌ సూరపనేని శ్రీనివాసరావులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని