‘క్లాప్‌’తో కదిలిన కమిషనర్లు
logo
Published : 18/06/2021 02:56 IST

‘క్లాప్‌’తో కదిలిన కమిషనర్లు

క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే


తెనాలిలో పర్యటిస్తున్న కమిషనర్‌ జస్వంతరావు

రాజధాని జిల్లాల్లోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లలో కొందరు మినహా మిగిలిన వారందరూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కనీసం వార్డుల్లో కూడా పర్యటించడం లేదనే ఆరోపణలుండేవి. వీరు ఛాంబర్లకే పరిమితం కావడంతో స్థానికులు తమ ఇబ్బందులను విన్నవించుకోవడానికి వారి వద్దకు వెళ్లడం, గది వద్ద పడిగాపులు కాయడం పరిపాటిగా తయారైంది. కమిషనర్‌ ఎప్పుడు ఖాళీగా ఉన్నారో చూసి లోపలికి పంపించే వరకూ బాధితులు వేచి ఉండాల్సివచ్చేది. కొన్ని పురపాలికల్లో అయితే వాటి కమిషనర్లు ఎవరో కూడా ఆ పట్టణ వాసులకు తెలియని పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ‘పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌’ కార్యక్రమం అమలు బాధ్యతల్ని ఏకంగా కమిషనర్లకు అప్పగించింది. దాని అమలులో భాగంగా కమిషనర్లు రోజూ విధిగా వార్డుల్లో పర్యటించి, గుర్తించిన సమస్యలకు పరిష్కారం చూపడంతోపాటు, వారి పర్యటన ఫొటోలను సైతం ప్రత్యేక యాప్‌లో పంపించాలని సర్కారు సూచించింది. ఈ ఆదేశాలు కమిషనర్లందరినీ ఛాంబర్లు వీడి, ప్రజల వద్దకు వెళ్లేలా చేశాయి.

అమలు ఇలా..

ప్రభుత్వం సుమారు రెండు నెలల క్రితం ప్రారంభించిన ‘పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌’ పట్ల ప్రజల్లో విస్తృత ప్రచారంతో పాటు, అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిందే ‘క్లాప్‌’ కార్యక్రమం. దీన్ని వంద రోజుల కార్యక్రమంగా రూపొందించారు. ఇందులో తడి, పొడి, హానికర చెత్తను వేర్వేరు డబ్బాల్లో అందజేయడం, పల్లపు ప్రాంతాలను మెరక చేయడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రత వంటి మెరుగైన పారిశుద్ధ్య చర్యలను విధిగా అమలు చేయాల్సి ఉంటుంది. తాగునీరు అందడంలేదని, వీధి దీపాలు వెలగడం లేదంటూ ప్రజలు ఫిర్యాదు చేసిన సమస్యలకు పరిష్కారం చూపాలి. అలాగే పైలెట్‌ వార్డుల్లో చెత్త పన్ను విధించి నూరుశాతం వసూలు చేయడం ద్వారా ఇతర వార్డుల్లోనూ దీన్ని అమలు గురించి వివరించనున్నారు. ఇందు కోసం కమిషనర్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నగర పాలకసంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లు క్రమం తప్పకుండా వార్డుల్లో పర్యటించి, ఆ ఫొటోలను ప్రత్యేక యాప్‌లో పంపిస్తున్నారు. దీంతో తమ కమిషనర్‌ ఎవరో కూడా తెలియని స్థానికులు తెలుసుకోడానికి, నేరుగా సమస్యల్ని చూపి, పరిష్కరించాలని కోరేందుకు మార్గం సుగమమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని