AP News: కొలువుకు వెళ్లి.. ప్రాణాలు కోల్పోయి..!
logo
Published : 18/06/2021 08:09 IST

AP News: కొలువుకు వెళ్లి.. ప్రాణాలు కోల్పోయి..!

వెంకటేష్‌, నరసింహారావు

పిడుగురాళ్ల, గురజాల, న్యూస్‌టుడే: చేతికి అంది వచ్చిన కుమారులిద్దరూ రోడ్డు ప్రమాదంలో విగత జీవులయ్యారు. కంటైనర్‌ ఢీకొని సోదరులిద్దరూ మృతిచెందిన సంఘటన గురువారం ఉదయం పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో జరిగింది. గురజాల మండలం దైద గ్రామానికి చెందిన కొమ్మరాజు లక్ష్మయ్య, కనకమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. లక్ష్మయ్య ఇస్త్రీ చేసి జీవనం సాగిస్తుండగా, కనకమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. గురజాలలోనే అన్న డిగ్రీ పూర్తి చేయగా, తమ్ముడు రెండో సంవత్సరం చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ ఉద్యోగ నిమిత్తం ఉదయాన్నే ఇంటి నుంచి బయలు దేరారు. కొలువు వస్తుందని అన్న నరసింహారావు(23)కు తోడుగా తమ్ముడు వెంకటేష్‌(20) ద్విచక్ర వాహనంపై పిడుగురాళ్లకు పయనమయ్యారు. మార్గ మధ్యలో బ్రహ్మణపల్లి వద్ద ఫోన్‌ మాట్లాడేందుకు ఆగి రోడ్డు పక్కన ఆగారు. దాచేపల్లి వైపు నుంచి వస్తున్న కంటైనర్‌ మృతు శకటంలా దూసుకొచ్చింది. కొంతదూరం ఈడ్చుకెళ్లి కంటైనర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఇంటి నుంచి వెళ్లిన గంటలోపే మీ కుమారులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న వార్త విని కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. అమ్మా కొలువులో చేరిన తరువాత ఫోన్‌ చేస్తానని చెప్పిన కుమారుని గొంతు ఇక జీవితంలో వినలేనని ఆ తల్లి రోదిస్తుండటం చూసి స్థానికులు కంటతడి పెట్టారు. జీవిత కాలం కష్టపడిన తండ్రి డిగ్రీ పూర్తయిన కుమారునికి ఉద్యోగం వస్తే తనకు చేదోడు వాదోడుగా ఉంటాడని భావించిన సమయంలో ఆయన ఆశలు ఆవిరయ్యాయి. గురజాల ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలకు పంచనామా అనంతరం దైదకు తరలించారు.డ్రైవరు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడని, తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నరసింహారావు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని