కృష్ణా వర్సిటీ అభివృద్ధికి మరో అడుగు
logo
Published : 18/06/2021 02:56 IST

కృష్ణా వర్సిటీ అభివృద్ధికి మరో అడుగు

రూ. 15 కోట్ల విడుదలకు ఆమోదం

కృష్ణా విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే

కృష్ణా విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. మౌలిక వసతుల కల్పనకు తాజాగా రూ.15 కోట్లు కేటాయించనున్నారు. విశ్వవిద్యాలయంలో పలు భవనాల నిర్మాణంతోపాటు నూజివీడు పీజీసెంటరులో మౌలిక సదుపాయాలు ఇలా అన్నింటికీ కలిపి గత పాలకమండలి సమావేశంలో రూ.38 కోట్లు కేటాయించగా వాటి అభివృద్ధి పనుల నిర్మాణ బాధ్యతలను ఏపీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించారు. వాటిలో చాలా వరకు పనులు ప్రారంభించారు. అప్పుడు కేటాయించిన నిధుల్లోనే వసతిగృహాలు నిర్మించాలని భావించినా అవి చాలకపోవడంతో తాజాగా కేటాయించే వాటిని వెచ్చించాలని నిర్ణయించారు.

ఏమేమి చేపడతారంటే.. వర్సిటీ చుట్టూ ప్రహరీ నిర్మాణం, ముఖ ద్వారం, యువతీ, యువకులకు వేర్వేరుగా వసతిగృహాలు, ఇంజినీరింగ్‌ కళాశాలకు భవనం నిర్మించాల్సి ఉంది. ఒక్కో వసతిగృహంలో 500 నుంచి 600మంది విద్యార్థుల వరకు ఉండేలా భవనాలు నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలోనే ఇంజినీరింగ్‌ కళాశాల నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాల్లో రెండవ అంతస్తు నిర్మించాలని నిర్ణయించారు. విశ్వవిద్యాలయం 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ప్రహరీ లేకపోవడంతో వెనుక భాగంగా ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు విస్తరిస్తున్నాయి. ఇకపై వాటన్నింటినీ తొలగించి చుట్టూ ప్రహరీ నిర్మిస్తారు. గురువారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర తదితరులు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన వర్సిటీ పాలకమండలి సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూనే విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

నూజివీడు పీజీ సెంటరు పేరు మార్పు

కృష్ణా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నూజివీడులో డా.ఎంఆర్‌ఏఆర్‌ పీజీసెంటరు నడుస్తోంది. పీజీసెంటరును పీజీ స్టడీస్‌గా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ కేంద్రానికి పర్యవేక్షణ చేసే హోదా ప్రత్యేక అధికారికి ఉండేది. ఇకపై ప్రిన్సిపల్‌ ఉండాలని నిర్ణయించారు. దీంతోపాటు ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న రిజిస్ట్రార్‌ వై.కె సుందరకృష్ణ, ప్రిన్సిపల్‌ సూర్యచంద్రరావు, ఆర్‌అండ్‌డి డైరెక్టర్‌ కె.జయలక్ష్మి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ రామశేఖరరెడ్డి తదితర పోస్టులను ర్యాటిఫికేషన్‌చేసి ఆమోదించారు. పాలకమండలి సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన పలు అంశాలను ఆమోదించారు. విశ్వవిద్యాలయంలో ఉన్న కోర్సులు తదితర అంశాలపై సమీక్షించగా సైన్సు కోర్సులతోపాటు ఇంజినీరింగ్‌ కళాశాలకు ల్యాబ్‌లను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు సభ్యులు వివరించారు.

అదొక్కటే ఆగింది: కె.బి చంద్రశేఖర్‌, ఉపకులపతి

పాలకమండలి సమావేశం సంతృప్తిగా ముగిసింది. సభ్యులు సూచించిన అన్ని అంశాలకు ఆమోదం లభించింది. అధ్యాపకుల జీతాలపెంపు అంశం ఒక్కటి మాత్రం ఆగింది. మిగిలిన విశ్వవిద్యాలయాలతో కలిపి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత సమావేశంలో రూ.38కోట్లు కేటాయించారు. అప్పుడు చేపట్టిన పనులకు వివిధ కారణాల వల్ల మరింత బడ్జెట్‌ అవసరమైంది. ఇందుకోసం రూ.15కోట్లతో ప్రతిపాదనలు చేయగా పాలకమండలి ఆమోదించడంతోపాటు నిధులు కూడా విడుదల చేయాలని తీర్మానించింది. మంత్రి పేర్ని నానిని కలిసి త్వరలోనే పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం. ఇటీవల ప్రారంభించిన తాగునీటి పైపులైన్‌ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అందరి సహకారంతో విశ్వవిద్యాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం.

డిజి లాకర్‌ ఏర్పాటు

ప్రస్తుతం డిజిటల్‌ వేదికగానే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న కోర్సులు, విద్యార్థులు, పరీక్షలు, వాటి ఫలితాలు, నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ సెమినార్‌లు ఇలా అన్నింటినీ వివరించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించి దాని నిర్వహణ సమర్థంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. పలు బహుళజాతి సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇకపై పత్రాలు ఆన్‌లైన్‌లోనే భద్రపరచుకునేలా డిజి లాకర్‌ ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని