ఉల్లంఘనులపై కఠిన వైఖరి
logo
Published : 18/06/2021 02:56 IST

ఉల్లంఘనులపై కఠిన వైఖరి

సడలింపు సమయంలోనే పనులు చూసుకోవాలి

‘ఈనాడు’తో నగర పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు

ఈనాడు, అమరావతి

కర్ఫ్యూను సమర్థంగా అమలు చేస్తున్నట్లు, నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని నగర పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు చెప్పారు. కరోనా కట్టడిలో ఇది కీలకమని, అనవసరంగా ప్రజలెవరూ బయట తిరగవద్దని విజ్ఞప్తి చేశారు. సడలింపు సమయాల్లోనే పనులు చూసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వివరించారు. తమ రెగ్యులర్‌ విధులతో పాటు శాఖలోని అన్ని విభాగాల పోలీసులు కర్ఫ్యూ విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఈ సమయంలో శాంతి, భద్రతలు అదుపు తప్పకుండా అన్ని చర్యలు తీసుకుంటున్ననట్లు చెప్పారు. కొవిడ్‌ బారిన పడిన సిబ్బందికి వైద్యపరంగా, అన్ని విధాలా తోడ్పాటు అందిస్తున్నామని ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖాముఖి విశేషాలు ఆయన మాటల్లోనే..

అకారణంగా బయటకు వస్తున్నారు

సాయంత్రం వేళల్లో ప్రజలు నడక కోసం, కాలక్షేపం కోసం బయట తిరుగుతున్నారు. రోడ్లు ఖాళీగా ఉన్నాయని సైక్లింగ్‌ చేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. దీని వల్ల వారి ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉండడంతో పాటు వ్యాప్తికి కారకులవుతారు. ఈ ధోరణిని నియంత్రించేందుకు కమిషనరేట్‌లోని అన్ని డివిజన్లలో ఉల్లంఘనులకు పోలీసు అధికారులు, సిబ్బంది కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. హెచ్చరించి పంపిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు 1,755 కేసులు పెట్టి, 6,315 మందిని అరెస్టు చేశాం. 4,798 వాహనాలను సీజ్‌ చేశాం. ఇందులో 4,553 ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు 211, కార్లు 34 ఉన్నాయి. మోటారు వాహన చట్టం కింద ఇప్పటి వరకు 77,829 చలానాలు రాసి రూ.2.15 కోట్ల అపరాధ రుసుం విధించాం.

అందరూ సహకరించాలి

కొవిడ్‌ రెండో వేవ్‌ ఎంతగా విరుచుకుపడిందో చూశాం. మరణాల రేటు ఎక్కువగా ఉంది. చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో మహమ్మారి మరింత విరుచుకుపడకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలి. కర్ఫ్యూ వేళలో ప్రజలు పోలీసులకు సహకరించాలి. అందరి ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని శక్తివంచన లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి సడలింపుల సమయంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నాం.

సిబ్బంది సంక్షేమంపై దృష్టి

విధి నిర్వహణలో నిమగ్నమైన పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మొదటి వేవ్‌లో 396 మంది ఇబ్బంది పడ్డారు. రెండో దశలో ఇప్పటి వరకు 478 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 452 మంది కోలుకోగా, 18 మంది చికిత్స పొందుతున్నారు. ఊపిరి సమస్యలతో 40 మంది వరకు ఆక్సిజన్‌ సాయం తీసుకున్నారు. దాదాపు అందరికీ టీకాలు వేయించాం. మొదటి డోసు 97 శాతం, రెండో డోసు 96 శాతం తీసుకున్నారు. కరోనా బారిన పడిన వారిని ఆదుకుంటున్నాం. డ్రైఫ్రూట్స్‌తో పాటు, కూరగాయలు, నిత్యావసరాలు అందజేస్తున్నాం.

సమన్వయంతో విధులు

కర్ఫ్యూ అమలు కోసం అధికారులు, సిబ్బంది అదనపు పనిగంటలు పనిచేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం విజయవాడ నగరంలో 70 పికెట్లు ఏర్పాటు చేశాం. వీటిల్లో 24 గంటలూ సిబ్బంది ఉంటున్నారు. వీరితో పాటు సంచార బృందాలు కూడా పనిచేస్తున్నాయి. శాంతి, భద్రతలు, ట్రాఫిక్‌, సీసీఎస్‌, తదితర విభాగాలకు చెందిన పోలీసులు కర్ఫ్యూ విధుల్లో రొటేషన్‌ పద్ధతిలో పాలుపంచుకుంటున్నారు. వారి రోజువారీ విధులతో పాటు వీటిని కూడా నిర్వర్తిస్తున్నారు. కీలకమైన నేర నియంత్రణ, కేసుల పురోగతికి సంబంధించి కూడా దృష్టి పెడుతున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని