వైద్యులపై దాడులు బాధాకరం
eenadu telugu news
Published : 19/06/2021 06:23 IST

వైద్యులపై దాడులు బాధాకరం

ఐ.ఎం.ఎ. హాలు ఆవరణలో నిరసన తెలుపుతున్న వైద్యులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందిస్తున్న వైద్యులపై దాడులు చేయడం బాధాకరమని ఐ.ఎం.ఎ. విజయవాడ నగరశాఖ పేర్కొంది. ఇటీవల అసోం, పశ్చిమ బంగ, ఒడిశా, పంజాబ్‌, కర్ణాటక, హరియాణా తదితర రాష్ట్రాల్లో వైద్యులపై దాడులు పెరిగిపోయాయని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై కొనసాగుతున్న దాడులను నిరసిస్తూ శుక్రవారం ఉదయం ఐ.ఎం.ఎ. హాలు ఆవరణలో వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఐ.ఎం.ఎ. నగర శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ మధుసూదన శర్మ మాట్లాడుతూ యాజమాన్యాలు వసూలు చేసే అధిక ఫీజుల్లో వైద్యుల పాత్ర ఉండదన్నారు. అయినప్పటికీ ప్రజాగ్రహానికి తామే గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై దాడులకు పాల్పడే వారికి జైలుశిక్ష పడేలా కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ తుమ్మల కార్తీక్‌ మాట్లాడుతూ ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా పని చేస్తూ దేశవ్యాప్తంగా 1400 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోతే 168 మందికి మాత్రమే సాయం అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌తో మరణించిన వైద్యులను అమరవీరులుగా గుర్తించి వారికి రూ.1 కోటి పరిహారం అందించాలని కోరారు. డాక్టర్‌ సుభాష్‌చంద్రబోస్‌, డాక్టర్‌ రవీంద్రనాథ్‌, డాక్టర్‌ రసిక్‌ సంఘ్వీ, డాక్టర్‌ రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని