ఈఎస్‌ఐ.. పంపించెయ్‌!
logo
Published : 22/06/2021 04:13 IST

ఈఎస్‌ఐ.. పంపించెయ్‌!

‘రిఫరల్‌’ పేరుతో ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు
పేదలపై పెను భారం
గుణదల, న్యూస్‌టుడే

అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కడుపునొప్పిగా ఉందని విజయవాడ ఈఎస్‌ఐ ఆసుపత్రికి వచ్చాడు. అతడిని ఒక సెకండరీ ఆసుపత్రికి రిఫరల్‌కు పంపారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం సిటీస్కాన్‌ చేయాలి అని రూ.3 వేలు కట్టించుకున్నారు. తర్వాత ర్యాపిడ్‌ టెస్టు నిర్వహించాలని మరో రూ.1200 వసూలు చేశారు. ఇలా ఆసుపత్రి లోనికి వెళ్లకుండానే రూ.4200 ఖర్చయింది. తర్వాత కొన్ని మందులు లేకపోవడంతో బయట కొంటే మరో రూ.10వేలు వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లివర్లో చీము పట్టిందని శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పి పంపించారు. కానీ కొన్నిరోజులకు కామెర్లు వచ్చాయి. తరువాత రివ్యూ కోసం వెళితే మళ్లీ జాయిన్‌ అవ్వాలన్నారు. రిఫరల్‌ కోసం ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్లితే వాళ్లు అలాగే అంటారని చెప్పి తిప్పి పంపారు.

సత్యనారాయణపురానికి చెందిన సాంబశివరావు మధుమేహ వ్యాధి, థైరాయిడ్‌ ఉందని ఈఎస్‌ఐ ఆస్పత్రికి వస్తే మరో సెకండరీ ఆసుపత్రికి రాశారు. అక్కడికి వెళితే ముందుగా రోగికి పీˆపీˆఈ కిట్ వేసి సిటీస్కాన్‌, మరలా ర్యాపిడ్‌ టెస్టు అంటూ రూ.5వేల వరకు బిల్లు వేశారు. కొన్ని మందులు రాసి ఇచ్చారు.  డిస్పెన్సరీకి వెళితే కొన్ని మాత్రమే దొరికాయి. మిగిలినవి బయట షాపులో కొనుగోలు చేశారు.
ఎస్‌ఐ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండా పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం పొందడం కలగానే మిగులుతోంది. రోగులు వస్తే ఇక్కడ చికిత్సకు సరైన వసతులు ఉండడం లేదు. దీంతో సెకండరీ, సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రులకు రిఫరల్‌ చేస్తున్నారు. అక్కడ  ఆ టెస్టు చేయాలి, ఈ మందులు లేవు అనే పేరుతో రోగుల నడ్డి విరుస్తున్నారు. కొవిడ్‌ పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారు. తర్వాత నుంచి రోగి ఖర్చు పెట్టిన సొమ్మును బీమా వైద్య సేవల శాఖకు బిల్లులు పెడితే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. సంవత్సరాలు వేచి చూడాల్సిందే అని పలువురు వాపోతున్నారు. దీనిపై ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ వెంకట రమణమూర్తిని సంప్రదించగా అత్యవసరమనుకుంటే రిఫరల్‌కు పంపుతామని చెప్పారు. ఇక్కడ భవనం పరిస్థితి సరిగా లేకపోవడంతో శస్త్రచికిత్సలు చేయడం మానేశామని పేర్కొన్నారు. సెకండరీ ఆసుపత్రుల వద్ద అదనపు ఖర్చులకు సంబంధించిన బిల్లులను డిస్పెన్సరీలో అందజేస్తే పరిశీలించి, మంజూరు చేస్తారని ఈఎస్‌ఐ ప్రాంతీయ కార్యాలయం సహాయ డైరెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు.

నూతన భవనం ఎప్పుడో?
విజయవాడలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి శిథిలావస్థకు చేరింది. భవనం పరిస్థితి బాగోలేదని గతంలో తిరుపతి ఐటీ ఇంజినీర్లు పరిశీలించి ధ్రువీకరించారు.ఇప్పటికే రాజమహేంద్రవరంలో కొత్త భవనం నిర్మాణం మొదలైంది. తిరుపతిలో నూతన ఆసుపత్రి తుదిదశకు చేరుకుంది. విజయవాడలో మాత్రం పరిస్థితి మారలేదు.

ఇన్‌పేషెంట్లకు అవకాశం లేదు..  
విజయవాడ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో మెడిసిన్‌, గైనిక్‌, సర్జరీ, ఈఎన్‌టీ విభాగాల్లో మాత్రమే వైద్యసేవలు అందుతున్నాయి. ఇక్కడ 110 పడకలు ఉన్నా ఇన్‌పేషెంట్లను అడ్మిట్‌ చేసుకోవడం లేదు. ఒక పక్క పెచ్చులు ఊడిపడుతున్నాయని శస్త్రచికిత్సలను నిషేధించారు. న్యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీకి సంబంధించిన సమస్యలతో రోజుకు 80 నుంచి 100 మంది రోగులు వస్తున్నారు. ఇక్కడ ఆ వైద్యసేవలు అందుబాటులో సెకండరీ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు రిఫరల్‌ చేస్తున్నారు. ఆయా ప్రైవేటు యాజమాన్యాల తీరుతో పేదలపై పెనుభారం పడుతుంది.

4 రకాల పరీక్షలే
ఈఎస్‌ఐలో నాలుగు రకాల రక్త పరీక్షలను మాత్రమే నిర్వహిస్తున్నారు. లివర్‌ ఫంక్షన్‌, కిడ్నీ ఫంక్షన్‌, మధుమేహం, లిపిడ్‌ ఫ్రొఫెల్‌ పరీక్షలు చేస్తున్నారు. వీటిని కూడా సెమీ ఆటోమెటిక్‌ యంత్రంతోనే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆటోమెటిక్‌ యంత్రాలతో ప్రైవేటు ఆసుపత్రులు దూసుకుపోతుంటే ఈఎస్‌ఐలో మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఆటోమెటిక్‌ యంత్రాలు కావాలని రాష్ట్ర బీమా వైద్యసేవల శాఖకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని అధికారులు వాపోతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని