వెక్కి వెక్కి ఏడ్చినా.. ఆలకించవేమమ్మా!
logo
Updated : 22/06/2021 04:55 IST

వెక్కి వెక్కి ఏడ్చినా.. ఆలకించవేమమ్మా!

ఓ తల్లి నిర్వాకం

రెండు గంటలు నరకాన్ని చవిచూసిన ఆడ శిశువు

తల్లి కన్న బిడ్డో.. పుట్టిన క్షణాల్లోనే వీధి పాలై నరకాన్ని చవిచూసింది. చీమలు కుట్టి 2గంటల సేపు నరకయాతన అనుభవించింది.అటుగా వెళ్లేవారి కంట పడడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన విజయవాడ ఆంజనేయవాగు కొండ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగింది. తల్లి గర్భం నుంచి భూమ్మీదకు వచ్చిన ఆ పసికూన అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సింది పోయి.. సంపంగి తిరపతయ్యవీధిలో మెట్ల మార్గం పక్కన ఖాళీ ప్రదేశంలోని చెత్త పక్కకు చేరింది. పసికందు గుక్కపట్టి ఏడుస్తుండడాన్ని స్థానికులు గమనించి దగ్గరకు వెళ్లి చూస్తే బొడ్డు, తలకు చీమలు పట్టి ఉన్నాయి. తలకు గాయమై రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న 2వ పట్టణ పోలీసులు ఆ శిశువును పాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రక్తం ఎక్కువగా పోయిందని వైద్యులు గుర్తించి రక్తం ఎక్కించారు. ప్రస్తుతం చిన్నారి బాగానే ఉంది. ఆ బిడ్డను అక్కడ ఎవరు వదిలేశారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అన్ని సచివాలయాల సిబ్బంది, ఏఎన్‌ఎంలతో ఆ ప్రాంతంలో ఎవరెవరు గర్భిణులుగా ఉన్నారు? వారి పరిస్థితిపై ఆరా తీయించినా ఫలితం లేకపోయింది. ఆడ శిశువు పుట్టిందని వదిలేశారా?, మరే ఇతర కారణాలతో గత్యంతరం లేక వదిలేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- న్యూస్‌టుడే, చిట్టినగర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని