బిడ్డ లేదు.. గడ్డ ఉంది
logo
Updated : 22/06/2021 05:54 IST

బిడ్డ లేదు.. గడ్డ ఉంది

గర్భిణి విషయంలో వైద్యుల నిర్లక్ష్యం
బాధిత మహిళ, బంధువుల ఆందోళన
విజయవాడ పాతాసుపత్రిలో సంఘటన
ఈనాడు, విజయవాడ


బాధిత మహిళ సుధారాణితో కలిసి ఆందోళన చేస్తున్న బంధువులు

డుపులో బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాడు, మందులు వాడమంటూ మూడు నెలలుగా వైద్యులు చెబుతూ వచ్చారు. చివరికి కడుపులో బిడ్డే లేదు.. ఓ గడ్డ ఉందనే విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు బంధువులు విలవిల్లాడిపోయారు. దీనికి బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి వద్దకు సోమవారం వచ్చి ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా వస్తున్నా కనీసం కడుపులో బిడ్డ పరిస్థితి ఎలా ఉందనేది పట్టించుకునే వాళ్లే లేరన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. ప్రస్తుతం బిడ్డ లేకపోగా.. తల్లి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

విజయవాడ గులాబీతోటకు చెందిన కె.సుధారాణి(21)కి శ్రీకాకుళానికి చెందిన సంతోష్‌తో వివాహం జరిగింది. ఏడో నెల గర్భిణిగా ఉన్న సుధారాణి ప్రసవం కోసం విజయవాడలోని పుట్టింటికి మూడు నెలల క్రితం వచ్చింది. అప్పటి నుంచి విజయవాడ పాతాస్పత్రిలోని మాతాశిశు విభాగంలో వైద్య పరీక్షల కోసం వస్తోంది. గత మూడు నెలలుగా ఆమె వస్తున్నా కనీసం కడుపులో బిడ్డ ఎలా ఉందనే వైద్య పరీక్షలను చేయలేదు. ప్రతిసారి బిడ్డ, తల్లి ఆరోగ్యం బాగానే ఉందని, పురిటి నొప్పులు వస్తే తీసుకురండంటూ వైద్యులు చెబుతూ వస్తున్నారని బాధితులు వాపోయారు. ప్రసవం కోసం వైద్యులు చెప్పిన సమయం కూడా దాటిపోయినా ఇంకా సుధారాణికి నొప్పులు రాలేదు. పది నెలలు నిండిపోతున్నా నొప్పులు రాలేదని మరోసారి వైద్యులను సంప్రదించగా ఏం పర్వాలేదని చెప్పి పంపించేశారు. దీంతో అనుమానం వచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రికి సోమవారం వెళ్లారు. స్కానింగ్‌ తీసి చూడగా కడుపులో బిడ్డ లేదు. చాలా నెలల క్రితమే ఇన్‌ఫెక్షన్‌ వచ్చి గడ్డలా మారిపోయిందని అక్కడి సిబ్బంది చెప్పారు.
ఇంత జరిగినా నిర్లక్ష్యమే.. సుధారాణి, బంధువులు కలిసి సోమవారం మధ్యాహ్నం పాతాసుపత్రికి వచ్చి మాతాశిశు విభాగంలోని వైద్య సిబ్బందిని సంప్రదించారు. ప్రస్తుతం స్కానింగ్‌ సిబ్బంది అందుబాటులో లేరని, ప్రధాన వైద్యులు కూడా లేరని, మంగళవారం రావాలంటూ అక్కడి సిబ్బంది సూచించారు. బిడ్డ లేదని తెలియడంతో తల్లి పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, అత్యవసరంగా వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదంటూ బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాతాసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే బాధితురాలికి వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు.

నెలన్నరకోసారి కచ్చితంగా పరీక్షలు..
- డాక్టర్‌ నాగేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌

బిడ్డ పెరుగుదల ఆగిపోవడం వల్ల ఇలా జరిగి ఉంటుంది. ఐదో నెలలోనే స్కానింగ్‌ చేసి ఈ విషయాన్ని వైద్యులు గుర్తించి చెబుతారు. ఆ తర్వాత కూడా నెలన్నరకోసారి గర్భిణులకు ఆసుపత్రిలో స్కానింగ్‌ చేస్తుంటాం. పాతాసుపత్రిలో ప్రతి రోజూ 20 నుంచి 30 మందికి పైగా గర్భిణులకు స్కానింగ్‌ చేసి రిపోర్టులు ఇస్తున్నాం. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో ఎనిమిది, తొమ్మిదో నెలల్లో వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. నెలలు నిండుతున్న వారికి కచ్చితంగా స్కానింగ్‌ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తారు. కొంతమందికి అవగాహన లేక పరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. తాజా సంఘటనలో ఏం జరిగిందనేది పరిశీలిస్తాను.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని