నిమిషాల్లోనే ట్యాంకులు నిండు!
logo
Published : 22/06/2021 04:13 IST

నిమిషాల్లోనే ట్యాంకులు నిండు!

రైలు బోగీల్లో క్విక్‌ వాటర్‌ సిస్టం
తొలగనున్న ఇబ్బందులు
రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే

బోగీల్లోకి నీళ్లు నింపుతున్న సిబ్బంది

రైలు బోగీల్లోకి నీళ్లు ఇక నిమిషాల వ్యవధిలోనే ఎక్కనున్నాయి. క్విక్‌ వాటర్‌ సిస్టం పేరుతో సరికొత్త సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. రైళ్లల్లో నీరు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతుంటారు. దూర ప్రాంతాల రైళ్లల్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నింపినా వెంటనే అయిపోతుంటాయి. మార్గ మధ్యలో ముఖ్య రైల్వేస్టేషన్లలో నింపినా సరే ఇదే పరిస్థితి తలెత్తుతుంది. రాత్రి సమయాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రయాణంలో అధికారులకు వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువగా నీళ్లపైనే ఉంటాయి.

విజయవాడ డివిజన్‌ పరిధిలో రోజూ అన్ని రైళ్లు కలిపి సుమారు 100 వరకు ఉంటున్నాయి. ఇకపై వీటికి చెక్‌ పెడుతూ అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా మూడు రైల్వే జోన్లలో ఏర్పాటు చేయగా అందులో విజయవాడ కూడా ఉంది. రైల్వేస్టేషన్‌కి చేరిన వెంటనే 24 బోగీలు ఉన్న రైల్లో నీళ్లు నింపాలంటే ప్రస్తుతం ఎక్కువ సమయం పడుతోంది. ఇకపై కొత్త విధానం క్విక్‌ వాటర్‌ సిస్టం ద్వారా ఐదు నిమిషాల వ్యవధిలోనే ట్యాంకులు నిండుతాయి. ప్రతి బోగీలో నీళ్ల ట్యాంకు సామర్థ్యం 1600 లీటర్లు కాగా రైలు మొత్తానికి సుమారు 40 వేల లీటర్లు అవసరమవుతాయి. ఇకపై తరచూ నీళ్లు నింపాల్సిన అవసరం ఉండదు. నూతన విధానం అమలుతో సమస్యలు తొలగిపోవడమే కాకుండా నీటి వృథాను కూడా అరికట్టవచ్చు. విజయవాడ రైల్వేస్టేషన్‌కు రైళ్ల రాకపోకల సంఖ్య 250పైనే ఉండగా ఇకపై ప్రయాణికులకు నీళ్ల సమస్య తలెత్తదు. దశల వారీగా ఈ కొత్త వ్యవస్థ విజయవాడ డివిజన్‌ పరిధిలోని అన్ని ముఖ్య రైల్వేస్టేషన్లలో త్వరలోనే అమలు కానుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని