నదీ తీరంలో ఇళ్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం
logo
Published : 22/06/2021 04:13 IST

నదీ తీరంలో ఇళ్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

ఇళ్లను తొలగిస్తున్న పొక్లెయిన్‌

కృష్ణలంక, న్యూస్‌టుడే: కృష్ణా పరివాహక వరదముంపు నివారణలో భాగంగా 16, 17, 18 డివిజన్ల పరిధిలో కరకట్ట దిగువన రక్షణగోడ నిర్మాణం నేపథ్యంలో ఇళ్ల తొలగింపు ప్రక్రియను అధికారులు సోమవారం ప్రారంభించారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఈ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.120 కోట్లతో ప్రభుత్వం రక్షణగోడ నిర్మాణం చేపడుతుందని, ఇందులో భాగంగా నివాసాలు కోల్పోతున్న వారికి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. తొలివిడతలో 93 మందిని ఎంపిక చేశామని, వారికి సంబంధించిన ఇళ్లను తొలగిస్తున్నామని చెప్పారు. మిగిలిన వారికి త్వరలో ఇస్తామని వెల్లడించారు. సిటీ ప్లానర్‌ లక్ష్మణరావు, చీఫ్‌ ఇంజినీర్‌ ఎం.ప్రభాకర్‌, డిప్యూటీ సిటీ ప్లానర్‌ సూరజ్‌కుమార్‌, జగదీష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

తమకు ఇళ్లు కేటాయించలేదని ఆందోళన చేస్తున్న నివాసితులు

గృహాలు కేటాయించలేదంటూ ఆందోళన
సుదీర్ఘకాలంగా నదీగర్భంలో జీవనాన్ని సాగిస్తున్నప్పటికీ తమకు ఇళ్లు కేటాయించకపోవడం అన్యాయమని ఆరోపిస్తూ నివాసితుల్లో పలువురు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము 25 ఏళ్లగా ఇళ్లను నిర్మించుకుని జీవనాన్ని సాగిస్తున్నామని, మొదటి విడతలో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పలువురు నదీగర్భంలో స్థలాల కొనుగోలు చేపట్టారని, వారందరికీ ఇళ్లు కేటాయించారని పేర్కొన్నారు. స్థానికుల్లో పలువురు వైఎస్సార్‌ కాలనీలో ఇళ్ల కేటాయింపునకు సంబంధించి గతేడాది దరఖాస్తులు చేపట్టిన క్రమంలో హామీ పత్రాలు పొందారు. వారికి ప్రస్తుతం ఇళ్ల కేటాయింపు ఉండదని అధికారులు చెబుతున్నారు. తమకు వైఎస్సార్‌ కాలనీలో ఇళ్లు వద్దని, ప్రస్తుతం ఇస్తున్న వాటినే కేటాయించాలని పలువురు డిమాండ్‌ చేశారు. వాలంటీర్లు  తమ పేర్లు నమోదు చేసినప్పటికీ జాబితాలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని