ముగ్గురు చిన్నారుల అదృశ్యం
logo
Published : 22/06/2021 04:13 IST

ముగ్గురు చిన్నారుల అదృశ్యం

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన మండలంలోని ఈదరలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై ఎన్‌.చంటిబాబు తెలిపిన వివరాల మేరకు... కగ్గా మురళీ, అప్సరలకు 15 ఏళ్ల కిందట వివాహమైంది. 3 ఏళ్ల నుంచి ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు శశిక(11), చంద్రిక(9) ఉన్నారు. శశిక 5వ తరగతి, చంద్రిక 3వ తరగతి చదువుతున్నారు. అప్సర ఈదరలో అమ్మాయిలతో కలిసి ఉంటుండగా... మురళీ విజయవాడ మల్లికార్జునపేటలో నివసిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇద్దరు బాలికలు ఇంట్లో ఉన్న రూ.100 తీసుకొని తమ నాన్న దగ్గరికి వెళ్తున్నామని తోటి చిన్నారులతో చెప్పి, వారి ఇంటి పక్కనే ఉండే గండికోట వెంకట్రావు కుమారుడు జగదీష్‌(8)ను కూడా తీసుకొని వెళ్లిపోయారు. కొంతసేపటికి కుటుంబ సభ్యులకు చిన్నారులు కనిపించకపోవడంతో చుట్టుపక్కల పిల్లలను ఆరా తీశారు. విజయవాడలోని తమ నాన్న దగ్గరకు వెళ్తున్నామని చెప్పినట్లు ఆ చిన్నారులు వెల్లడించారు. అటు తండ్రి దగ్గరకు పిల్లలు చేరకపోవడం, గ్రామ పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు నేతృత్వంలో సీఐ కె.సతీష్‌, ఎస్సై ఎన్‌.చంటిబాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విజయవాడ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, అన్ని దేవాలయాలు, ప్రధాన కూడళ్లలో వెతికారు. రాత్రి 12 గంటల వరకు పిల్లల ఆచూకీ లభించలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని