సామూహిక అత్యాచారం కేసులో పురోగతి
logo
Published : 22/06/2021 05:00 IST

సామూహిక అత్యాచారం కేసులో పురోగతి

మాట్లాడుతున్న గుంటూరు అడిషినల్‌ ఎస్పీ ఈశ్వరరావు

తాడేపల్లి, న్యూస్‌టుడే: సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద కృష్ణానదిలో ఈ నెల 19వ తేదీ రాత్రి ఓ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పురోగతి కనిపిస్తున్నట్లు గుంటూరు అడిషనల్‌ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. అర్బన్‌ ఎస్పీ కేసును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. స్టేషన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించి కేసు పురోగతిని పరిశీలించి పలువురు అనుమానితులను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితురాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. నేర నియంత్రణలో నిపుణులైన అధికారులను, సిబ్బందిని కేసు దర్యాప్తుకు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. విచారణలో విజయవాడ నగర పోలీసులు సహకరిస్తున్నారన్నారు. మద్యం, గంజాయి సేవించే వారిని గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు.
ఫోన్‌కాల్స్‌ డేటాపై ఆరా...
సీతానగరం పుష్కరఘాట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సాయంత్రం 5 గంటల నుంచి రెండు వాహనాల్లో పోలీసులు తరలివచ్చారు. పుష్కరఘాట్‌ వద్ద రైల్వే వంతెన దిగువ భాగాన యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని అర్బన్‌ ఎస్పీ పరిశీలిస్తారనే సమాచారంతో అదనపు బలగాలను ఘాట్ల వద్ద ఏర్పాటు చేశారు. ఇప్పటికే యువతితో నది వద్దకు వచ్చిన యువకుడికి పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితులను చూపుతున్నారు. తాడేపల్లి, విజయవాడ, మహానాడు ప్రాంతాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. సీతానగరంలో ఈ నెల 19వ తేదీ నుంచి 20వరకు వరకు ఆ ప్రాంతంలో ఎవరెవరితో మాట్లాడారో ఫోన్‌కాల్స్‌  డేటాను సేకరిస్తున్నారు. నిందితులు బాధితుల నుంచి సెల్‌ఫోన్‌ అపహరించుకుపోవడంతో కాల్‌డేటాను తీసుకుంటున్నారు. మరో 24గంటల్లో నిందితులను గుర్తించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

పుష్కరఘాట్లలో గాఢాంధకారంతో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నట్లు గుర్తించి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు.. పుష్కరఘాట్లలో హైమాస్ట్‌ దీపాలను వెలిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి డిప్యూటీ కమిషనర్‌ రవిచంద్రారెడ్డితో కలిసి  పుష్కరఘాట్లను ఆయన పరిశీలించారు. ఆ ప్రాంతంలో హైరిజల్యూషన్‌ సామర్యర్థం కలిగిన సీసీ కెమెరాలు, రాత్రి వేళల్లో ఎవరూ అటుగా వెళ్లకుండా నిబంధనలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు.


నదీ విహారానికి వచ్చిన జంటపై దాడిచేసి యువతిని అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు రమాదేవి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆమె సీతానగరంలోని ఘటనా ప్రదేశాన్ని మహిళా సంఘం సభ్యులతో కలిసి పరిశీలించారు. జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమచ్చ దుర్గాభవానీ, ఐద్వా జిల్లా అధ్యక్షులు దొంతిరెడ్డి శ్రీనివాసకుమారి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని