కరోనా బాధితులను ఆదుకోకుంటే ఉద్యమం ఉద్ధృతం
logo
Published : 22/06/2021 05:00 IST

కరోనా బాధితులను ఆదుకోకుంటే ఉద్యమం ఉద్ధృతం

కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, జంగాల అజయ్‌ కుమార్‌ తదితరులు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: కరోనా వల్ల మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోకపోతే అంచెలంచెలుగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని మాజీమంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు హెచ్చరించారు. కొవిడ్‌ బాధితులకు పరిహారం అందజేయాలని కోరుతూ రాజకీయ పక్షాల నాయకులు కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఆనందబాబు మాట్లాడుతూ ఆక్సిజన్‌ అందక చనిపోయిన వారివి ప్రభుత్వ హత్యలుగా పరిగణించి రూ.25లక్షలు పరిహారం అందజేయాలని, కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరారు. కొవిడ్‌ మరణాలన్నింటినీ కార్డియాక్‌ అరెస్ట్‌ల కింద చూపారని.. దొంగ లెక్కలు చూపి ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించారని ఆరోపించారు. తెదేపా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రమాదాన్ని అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడం, సకాలంలో వ్యాక్సిన్‌ వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10,000 ఆర్థిక సహాయం అందించాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్‌ నసీర్‌, గుంటూరు పశ్చిమ ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెండింగ్‌ బకాయిలను చెల్లించాలని కోరారు. తెదేపా నాయకులు గంజి చిరంజీవి, పిల్లి మాణిక్యరావు, మానుకొండ శివప్రసాద్‌, కనపర్తి శ్రీనివాసరావు, అన్నాబత్తుని జయలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని