మేం చెప్పిందే.. చట్టం!
logo
Published : 22/06/2021 05:00 IST

మేం చెప్పిందే.. చట్టం!

నిబంధనలకు విరుద్ధమే అయినా  పనులు చక్కబెట్టాల్సిందే..
నేతల పెత్తనం భరించలేక ఆందోళనలో అధికారగణం 

ఈనాడు, గుంటూరు

జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల ప్రధాన అనుచరులు అధికారులపై పెత్తనం చలాయిస్తున్నారు. నిబంధనలు, చట్టాలు గురించి తమకు చెప్పొద్దని, తాము చెప్పింది చేయాల్సిందేనని హుకుం జారీచేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి డివిజన్‌ వరకు సిబ్బంది, అధికారులు నేతలు చెప్పిన పనులు చేయలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దస్త్రాలపై సంతకాలు పెట్టి ఆమోదిస్తే, దానికి తాము బాధ్యత వహించాల్సి ఉన్నందున ఆందోళన చెందుతున్నారు. తాము చెప్పిన పని చేయకపోతే తమ నియోజకవర్గంలో పని చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మండల స్థాయి అధికారులు నేతలు చెప్పిన పనులు చేయలేక దీర్ఘకాలిక సెలవుపై వెళుతున్నారు. ఈక్రమంలో నేతలు వారికి అనుకూలంగా వ్యవహరించే అధికారులకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించేలా చేసి  వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు.
కృష్ణాతీరంలో వాణిజ్య పంటలైన పత్తి, మిర్చికి పేరుగాంచిన నియోజకవర్గం అక్రమాలకు అడ్డాగా మారింది. క్షేత్రస్థాయి అధికారులు అక్రమాలను అడ్డుకోవాలని చూస్తే నేత ఒకరు కన్నెర్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఇద్దరు అధికారులు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికాగా, మండలస్థాయి అధికారి ఒకరు విధులకు రాకుండా సెలవులో వెళ్లారు. నియోజకవర్గంలో అన్ని పనులు చక్కబెడుతున్న నేత మాట వినని అధికారులు సర్దుకోవాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేతల సిఫార్సులు పెరిగిపోవడంతో ఇళ్ల స్థలాల పట్టాల విషయంలో అధికారులు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి లేదు. ఇళ్ల స్థలాలకు సేకరించిన భూముల విషయంలోనూ నేతలు చెప్పినచోటే తీసుకోవాల్సి వచ్చింది. దస్త్రాలపై తాము సంతకాలు చేస్తున్నామని, విచారణ జరిగితే తాము ఇబ్బందులు ఎదుర్కొంటామని ఉద్యోగులు ప్రస్తావిస్తే, పని చేయలేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల్లో అడ్డగోలుగా తవ్వకాలు చేసి మట్టి తరలించి నేతలు జేబులు నింపేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కీలకనేత మరో స్థానికనేతతో కలిసి 40 వాహనాల ద్వారా ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై ఇప్పటికే నిఘా విభాగం వివరాలు సేకరించినట్లు సమాచారం.

డెల్టాలో ప్రజాప్రతినిధి ఒకరు ఇళ్ల స్థలాలకు బుసక తరలింపు పేరుతో కృష్ణానది నుంచి ఇసుక తరలించి రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. మండల, డివిజన్‌ స్థాయి అధికారుల కళ్లెదుటే బుసక పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా యంత్రాంగం చూసీచూడనట్లు ఉంటోంది. సదరు నేత ఇళ్ల స్థలాలకు భూసేకరణలో తనదైన పాత్ర పోషించారు. ఇసుక విధానంలో మార్పులు తీసుకువచ్చి కొత్త గుత్తేదారుకు సరఫరా బాధ్యతలు అప్పగించడంతో ప్రస్తుతం బుసక పేరుతో ఇసుక తరలింపునకు అడ్డుకట్ట పడింది.

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గంలో నేత ఒకరు నెలవారీగా రూ.కోట్లలో ఆదాయం గడిస్తున్నారు. ఇక్కడ జరిగే మైనింగ్‌లో ప్రతి టన్నుకు ఆయనకు నిర్ణీత మొత్తం వ్యాపారులు చెల్లించాలి. బయటకు అంతా సవ్యంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నా అందరి తరఫున నెలకు రూ.కోట్లల్లో  చెల్లించాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. ఇదంతా క్షేత్రస్థాయి యంత్రాంగానికి తెలిసినా అడ్డుకునే పరిస్థితి లేదు. ఎవరైనా ఎదురుతిరిగితే యంత్రాంగం సాయంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు.  

ల్నాడులోని ఒక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి ఏకంగా స్థిరాస్తి వ్యాపారం చేపట్టారు. తాను వేస్తున్న వెంచర్లకు ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తరలిస్తున్నారు. క్షేత్రస్థాయి యంత్రాంగం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కన్నెర్ర చేస్తున్నారు. వాగుల్లో ఇసుక తన అనుచరుల ద్వారా తవ్వించి సొమ్ము చేసుకుంటున్నారు. బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేవారు కప్పం కట్టాల్సిందే. తాను నిర్వహిస్తున్న ఛారిటబుల్‌ ట్రస్టుకు విరాళాలు ఇవ్వాలని పలువురి నుంచి సొమ్ము వసూలు చేశారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేసే వారు నెలవారీగా మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుండటంతో భూమిని  వ్యవసాయేతర అవసరాలకు మార్పు చేసుకోవాలంటే నేతను కలిసిన తర్వాతే దస్త్రాలు కదులుతున్నాయి.

ముద్రతీర ప్రాంతంలోని ఓ నియోజకవర్గంలో రియల్‌ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ప్రజాప్రతినిధి ఒకరు తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎకరాకు రూ.2లక్షలు చొప్పున నేతకు ఇచ్చిన తర్వాతే వ్యవసాయేతర భూమిగా మారుతోంది. ఇక్కడ నేత అనుచరులు ఐదుగురు ఇసుక అక్రమ రవాణా చేస్తూ నెలకు రూ.10లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇసుక తవ్వకాలపై స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో నిఘా విభాగానికి ఫిర్యాదులు వెళ్లాయి. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన అధికారులు సైతం నేత చెప్పినట్లు తనిఖీలు చేసి వెళ్లడం గమనార్హం. ప్రభుత్వసంస్థల ఏర్పాటు, ఇళ్ల స్థలాలకు భూసేకరణ జరిగే ప్రాంతంలో ముందస్తుగా తన బినామీల చేత భూములు కొనుగోలు చేయించి లబ్ధిపొందారు. వీటికి యంత్రాంగం సహకరిస్తేనే ఇక్కడ విధులకు ఆటంకం ఉండదు.

డెల్టాలో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన ప్రజాప్రతినిధి ఒకరు మండలాల వారీగా ఏజెంట్లను  ఏర్పాటుచేసుకుని సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఏ పని జరిగినా నాకేంటి? అనే ధోరణిలో నేత వ్యవహరిస్తుండటంతో సొంత పార్టీ వారి నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మండలస్థాయి అధికారి ఒకరు గతంలో వసూళ్ల బాధ్యత తీసుకొని రూ.కోటిపైగా వసూలుచేశారు. చివరికి అధికారి, నేత మధ్య సొమ్ము పంపిణీలో విభేదాలు రావడంతో బదిలీపై అక్కడి నుంచి వెళ్లిపోయారు.  క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు తమకు ఇబ్బందులు వస్తాయని చెబుతున్నా నేత లెక్కచేయకుండా తాను అనుకున్నదే చేయిస్తున్నారు.

తీర ప్రాంతంలోని మరో నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి కుటుంబసభ్యులు చెప్పినట్లు వింటేనే అక్కడ అధికారులు పనిచేసే పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో వ్యవస్థ  మొత్తం తన చేతిలో పెట్టుకుని నడిపిస్తున్నారు.  ఇక్కడ ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలియకుండా వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. జూదంతోపాటు అన్ని అక్రమాలు ఇక్కడ జరుగుతున్నా అధికారులు ప్రశ్నించే పరిస్థితి లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని