లేఔట్లా...తటాకాలా..!
logo
Published : 22/07/2021 05:00 IST

లేఔట్లా...తటాకాలా..!

చిన్న వర్షానికే మునక

జగనన్న కాలనీల తీరిది

ఈనాడు, అమరావతి

ఆ చిత్రాన్ని చూశారా..! అవి పంట పొలాలు అనుకుంటున్నారా..? కానేకాదు. అక్కడ జగనన్న కాలనీ వెలవబోతోంది. నిరుపేదలకు గూడు కల్పించేందుకు ఇచ్చిన నివేశన స్థలాల లేఅవుట్లు అవి. ఇది గన్నవరం మండలంలోని బుద్ధవరం పంచాయతీ పరిధిలో లబ్ధిదారుల కోసం వేసిన లేఅవుటు. మొత్తం 500 మందికి ఇక్కడ సెంటున్నర చొప్పున అందజేశారు. మొత్తం 11 ఎకరాల్లో లేఔట్‌ వేశారు. 250 మంది వరకు శంకుస్థాపనలు చేసి ఇళ్లు నిర్మాణం చేయాలని సంకల్పించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీటితో నిండిపోయి పంట పొలాలను తలపిస్తున్నాయి. ఇక్కడ ఇంటి నిర్మాణం ఎలా చేయాలా అని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం తగ్గిన తర్వాతే పునాదులకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇవే కాదు జిల్లాలో పలుచోట్ల పేదల కాలనీల కోసం కేటాయించిన స్థలాల్లో నీరు చేరింది. లేఔట్లు తటాకాలను తలపిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో దాదాపు 48వేల గృహాలకు శంకుస్థాపనలు లక్ష్యం కాగా సుమారు 70వేల వరకు చేశారు. కానీ ప్రస్తుతం ఇంటి నిర్మాణం సాధ్యం కావడం లేదు. మరోవైపు కాలనీల్లో సరిహద్దులు చెరిగిపోయి వివాదాలు ఏర్పడుతున్నాయి. ఘనంగా ప్రారంభమైన శంకుస్థాపనలు పునాదులకే పరిమితమయ్యాయి. జిల్లాలో రూ.కోట్లు వెచ్చించి నివేశన స్థలాల కోసం భూములు కొనుగోలు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పలు లేఅవుట్లు ముంపునకు గురయ్యాయి. స్థలాలను తిరస్కరిస్తే సంక్షేమ ఫలాలు కూడా రావని అధికార పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. దీంతో లబ్ధిదారులు మౌనంగా ఉంటున్నారు. ఇచ్చిన స్థలం తీసుకోవాలి. లేకుంటే జాబితాలో పేరు గల్లంతేనని పలుచోట్ల వాలంటీర్లు, స్థానిక నేతలు లబ్ధిదారులను భయపెడుతున్నట్లు తెలిసింది. జిల్లాలో ఎకరా కనిష్ఠంగా రూ.18లక్షల నుంచి గరిష్ఠంగా రూ.75లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. మొత్తం మీద రూ.1200 కోట్ల వరకు భూసేకరణకే వెచ్చించారు. శంకుస్థాపనల అనంతరం స్వల్ప వర్షాలకే లేఔట్లు నీటితో నిండిపోవడంతో వాటి పరిస్థితి తేటతెల్లమవుతోంది.

● విజయవాడ నగరవాసులకు ప్రధానంగా మూడు ప్రాంతాల్లో భూసేకరణ జరిపి నివేశన స్థలాలు కేటాయించారు. ఇవన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. జి.కొండూరు మండలం వెలగలేరు, హెచ్‌.ముత్యాలంపాడు, మునగపాడు, సున్నంపాడు, కౌలూరు గ్రామాల్లో సేకరించారు. వెలగలేరులో సేకరించిన 179.49 ఎకరాలలో భారీ లేఔట్‌ వేశారు. ఇటీవల వర్షాలకు ప్లాట్లు మునిగిపోయాయి. ముత్యాలంపాడు గ్రామంలో 86.39 ఎకరాలకు దారితెన్నూ లేదు. మునగపాడు గ్రామంలో 105.84 ఎకరాలు, సున్నంపాడులో 119.46 ఎకరాలు సేకరించారు. వీటికీ అదే పరిస్థితి. విజయవాడ నగరంలో 93,610 మంది లబ్ధిదారులను గుర్తించారు. నున్నలోనూ భారీ లేఔట్‌ వేశారు. ఇదంతా బురదమయంగా మారింది. పశ్చిమ నియోజకవర్గం వారికి వెలగలేరు, సెంట్రల్‌ నియోజకవర్గం వారికి నున్న ఇతర ప్రాంతాలు, తూర్పు నియోజకవర్గం వారికి వణుకూరు, కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేశారు. వణుకూరు లేఔట్లలోనూ వర్షపు నీరు భారీగా చేరింది. లేఅవుట్‌లలో అంతర్గత రోడ్ల పేరుతో మట్టి పోయడంతో నీరు ఎటూ వెళ్లే పరిస్థితి లేదు. కనీస మౌలిక వసతులు, డ్రైనేజీ ఇప్పుడప్పుడే ఏర్పాటు చేసే పరిస్థితి లేదు.

● గ్రామీణ ప్రాంతాల్లోనూ లేఔట్లు మునిగిపోయాయి. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోనూ వాగుల వెంట సేకరించిన స్థలాలకు ముంపు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నందిగామ మండలం చందాపురంలో 4.95ఎకరాల లేఅవుట్‌ పరిస్థితి అంతే. రాఘవాపురం, అల్లూరు, జుజ్జూరులోని నివేశన స్థలాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. వత్సవాయి మండలంలో వేమవరం, భీమవరం, పోలంపల్లి, వత్సవాయిలో, జగ్గయ్యపేటలో తిరుమలగిరి, పెనుగంచిప్రోలు పట్టణ శివారులో వేసిన లేఔట్లకు వరద ముప్పు ఉంది. మైలవరం నియోజకవర్గంలో ఎదురువీడు గ్రామంలో సేకరించిన భూములు వరదలో మునిగాయి. ఇక్కడ మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యటించి ఈ భూములు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. గుడివాడ నియోజకవర్గంలో, కైకలూరు, నూజివీడు, అవనిగడ్డ, పామర్రు, పెడన నియోజకవర్గాల్లో నిరుపేదలకు ఇచ్చే నివేశన స్థలాలు ఊరికి దూరంగా ఉండడం, పొలాల్లో వేయడం వల్ల వర్షపు నీటికే చెరువుల్లా మారుతున్నాయి. భారీ ఎత్తున మెరక పనులు చేస్తే తప్ప ఇక్కడ కాలనీలు వరద సమస్య నుంచి బయటపడే పరిస్థితి లేదు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో బాపులపాడు చెరువు భూమినే లేఔట్‌గా వేశారు.

● జగనన్న కాలనీల్లో ప్రస్తుతం లేఔట్‌ వేసి మార్కింగ్‌ చేసి లబ్ధిదారులకు కేటాయించారు. 20 అడుగులు, 30 అడుగులు రహదారి కోసం వదిలారు. మెరక పేరుతో ఈ రహదారులపై మట్టి పోశారు. కానీ మెరక చేయలేదు. లబ్ధిదారులు కనీసం 3 నుంచి 5 అడుగుల వరకు పునాది లేపాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఇంటి నిర్మాణం చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాలనీలు అభివృద్ధి చెందితే ఇళ్లు కిందకు అయిపోతాయని వారు చెబుతున్నారు. దీంతో 5 అడుగుల నుంచి ఇంకా అవసరమైతే మరింత ఎత్తుకు లేపుకోవాలని చెబుతున్నారు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.1.8లక్షల్లో సగానికి పైగా పునాది లేపేందుకు ఖర్చు అవుతుందని భవన నిర్మాణ కార్మికులు చెబుతున్నారు. కనీసం ఎత్తు లేపితే.. రాయి, పునాది, మట్టి ఖర్చు కలిపి రూ.50వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

నందిగామ పట్టణ నిరుపేదలకు అనాసాగరం గ్రామంలో నివేశన స్థలాలు కేటాయించారు. అక్కడ 23 ఎకరాలను కొనుగోలు చేసి మరీ ఏర్పాటు చేశారు. నందిగామ నుంచి అనాసాగరం మూడు కి.మీ దూరం ఉంటుంది. అంతదూరం వెళ్లలేమని లబ్ధిదారులు వాపోతున్నారు. వాగు పొంగితే పేదలకు ఇచ్చిన స్థలాలు మోకాలి లోతు నీటిలో మునుగుతాయి. మొత్తం 1260 మందికి కేటాయించారు. తొలి దశలో 60 మంది వరకు శంకుస్థాపనలు చేశారు. కానీ నిర్మాణం చేయడానికి వీల్లేకుండా మారింది.


డ్రెయినేజీ ఏర్పాటు చేస్తే..

పేదల కోసం సేకరించిన స్థలాలు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని లెవలింగ్‌ చేస్తున్నాం. ఇటీవల కురిసిన వర్షాలకు లెవల్‌ చేసిన లేఔట్లు బాగానే ఉన్నాయి. కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్డుకు సైడ్‌ కాలువలు నిర్మాణం చేస్తే వర్షపు నీరు నిలువదు. ముందుగా ఇంటి నిర్మాణం తర్వాత మౌలిక వసతులు సమాంతరంగా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. సమస్య ఉన్న చోట పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం.

- కె.మాధవీలత, సంయుక్త కలెక్టర్‌


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని