ఆడుదామా.. ఆగుదామా..
eenadu telugu news
Published : 26/07/2021 03:54 IST

ఆడుదామా.. ఆగుదామా..

మూడో దశపై వేచిచూసే ధోరణిలో క్రీడాకారులు

బోసిపోతున్న మైదానాలు

అమరావతి ఫీచర్స్‌, న్యూస్‌టుడే

కొవిడ్‌ మొదటిదశ క్రీడా మైదానాల తలపులు మూసివేసింది. కుదుటపడుతుందనుకున్న తరుణంలో రెండోదశ కుదేలు చేసింది. రెండోవిడత ఆన్‌లాక్‌ తరువాత క్రీడా మైదానాలు తెరచుకున్నా భయం పోలేదు. మూడోదశ పొంచి ఉందనే హెచ్చరికలు తల్లిదండ్రుల్ని భయపెడుతున్నాయి. వైద్యఆరోగ్యశాఖతోపాటు నిపుణుల హెచ్చరికలతో పిల్లల్లి ఇంటికే పెద్దలు పరిమితం చేస్తున్నారు. ఈ పరిణామం క్రీడారంగంపై మరింతగా ప్రభావం చూపిస్తుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 1 నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులు సుమారు 20 లక్షల మంది ఉన్నారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో క్రీడలకు ప్రాధాన్యత ఉంటుంది. ఏటా నిర్వహించే స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌)లో సత్తా చాటేందుకు రెండు జిల్లాల నుంచి సుమారు 4 లక్షల మంది విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడల్లో సాధన చేస్తున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్‌యూ), కృష్ణా విశ్వవిద్యాలయం నూజివీడు ట్రిపుల్‌ ఐటీతోపాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నారు నాలుగైదేళ్లుగా క్రీడల్లో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించబోయే దశలో కొవిడ్‌ వారి ఆటలపై నీళ్లు చల్లింది. చదువుతోపాటు క్రీడల్లోనూ పిల్లల్ని ప్రోత్సహించాలనే స్పృహ తల్లిదండ్రుల్లో పెరిగినా ఎక్కువ ఆటలు సమూహాలతోనే ఆడాల్సి రావడంతో ఇండోర్‌ గేమ్స్‌ వైపు పిల్లల దృష్టి మరలుస్తున్నారు. పాఠశాల విద్యార్థులే కాకుండా కళాశాల చదువులు సాగిస్తున్న యువత సైతం ఆటలకు దూరమయ్యారు. నైపుణ్యాల్ని పదును పెట్టేందుకు చెంతన అవకాశాలు లేకపోవడం వారిని అయోమయానికి గురి చేస్తోంది.


సత్తెనపల్లికి చెందిన ఫుట్‌బాల్‌ క్రీడాకారులు తమకు నైపుణ్యమున్న క్రీడల్లో చిన్నారులకు తర్ఫీదు ఇచ్చేందుకు గత ఫిబ్రవరిలో క్రీడా శిబిరాన్ని ప్రారంభించారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదరణవచ్చి 70 మంది వరకు పాఠశాల విద్యార్థులు చేరారు. రెండు నెలలు శిక్షణ పూర్తయ్యేసరికి కరోనా రెండోదశ మొదలైంది. దీంతో మూడు నెలలు పూర్తిగా శిక్షణ నిలిచిపోయింది. కొవిడ్‌ మినహాయింపులతో పక్షం రోజులక్రితం మళ్లీ శిక్షణ ప్రారంభించినా పట్టుమని పదిమంది కూడా రావట్లేదు. పిల్లల్ని సమూహాల్లోకి పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడట్లేదని స్పష్టమవుతోంది.


విజయవాడ, గుంటూరు నగరాలు చదువుకే కాదు క్రీడలకు హబ్‌లు. వేసవితోపాటు ఏడాదంతా క్రీడా సందడి రెండు నగరాల్లో ఉంటుంది. శాప్‌ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా శిక్షణా శిబిరాల్లో వందలమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొంటారు. దీనికితోడు ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్సు అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిరంతరం టోర్నీలు జరుగుతుంటాయి. రెండేళ్లుగా క్రీడా సందడి కరోనా పడగతో లేకుండాపోయింది. రెండు నగరాల్లోని స్టేడియాలు క్రీడాకారులు లేకుండా వెలవెలబోతున్నాయి.


క్రీడల్లో రాణించే విద్యార్థులకు చదువు, ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్‌ అమల్లో ఉంది. ఉన్నత విద్యాభ్యాసనతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు రిజర్వేషన్‌పై ఎక్కువమంది ఆధారపడుతున్నారు. క్రీడల్లో సత్తా చాటాలనే సంకల్పంతో ఉన్న క్రీడాకారుల పరిస్థితి ఇప్పుడు డోలాయానంలో ఉంది. కరోనాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్నిరకాల పోటీలు ఆగిపోయాయి. దీంతో ఆటను కొనసాగించాలా వద్దా అనే మీమాంస క్రీడాకారుల్లో ఉంది.


ఇండోర్‌ గేమ్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాం..

కొవిడ్‌తో మైదానాల్లో పిల్లల్ని ఆడించే పరిస్థితి లేదు. యువత పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రెండేళ్లుగా ఆటలకు దూరమవ్వడంతో క్రీడాకారుల్లో నైపుణ్యం తగ్గుతుంది. పిల్లలు పూర్తిగా ఆటలకు దూరమవ్వకుండా ఇండోర్‌ గేమ్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాం. క్రీడాకోటాలో చదువు, ఉద్యోగాలు సాధించాలనుకునే యువత కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సమూహాలుగా కాకుండా వ్యక్తిగతంగా సాధన చేయాలి. క్రీడా శిక్షణా శిబిరాలు మూడోదశపై స్పష్టత వచ్చిన తరువాత పున:ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. గడచిన ఏడాది కరోనా రెండోదశ కేసులు తగ్గిన తరువాత స్థానిక టోర్నీలు జరిగాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నాం.

- ఎల్‌.పిచ్చయ్య, క్రీడా శిక్షకుడు, వ్యాయామోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని