విందు ఖర్చు... వితరణకు
eenadu telugu news
Updated : 26/07/2021 11:24 IST

విందు ఖర్చు... వితరణకు

అనాథ, వృద్ధాశ్రమాలకు ఆర్థిక సాయం
కొవిడ్‌ వేళ ఆదుకుంటున్న పలువురు దాతలు
ఈనాడు, అమరావతి - సంగడిగుంట, న్యూస్‌టుడే

విజయవాడ, గుంటూరుల్లో ఏటా వేల సంఖ్యలో వేడుకలు జరుగుతుంటాయి. విజయవాడ నగరంలోని ఫంక్షన్‌హాళ్లు, ఇతర వేదికలపై వివాహాలు, ఇతర వేడుకలు ఏటా 25 వేల నుంచి 30వేల వరకు జరుగుతుంటాయి. గుంటూరు నగరంలోనూ ఏటా కనీసం 15వేలకు పైగానే వేడుకలుంటాయి. ఒక్కో విందుకు స్థాయిని బట్టి.. కనీసం రెండు లక్షల నుంచి పాతిక లక్షల వరకు ఖర్చు చేస్తుంటారు. ఒక్కో వేడుకకు కనీసం 500 నుంచి ఐదారు వేల మంది వరకు అతిథులు హాజరవుతుంటారు. వారికోసం స్థాయిని బట్టి.. వందల రకాల పదార్థాలను సిద్ధం చేసి వడ్డిస్తుంటారు. ఇలాంటి వేడుకల్లో మిగిలిపోయే ఆహారమే భారీఎత్తున అనాథ, వృద్ధాశ్రమాలకు అందిస్తుంటారు. అమృతహస్తం లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని విజయవాడలోని కాలనీలు, వాడల్లో ఏడాది మొత్తం పంపిణీ చేస్తుంటారు. గత ఏడాదిన్నరగా భారీ వేడుకలు దాదాపు ఆగిపోయాయి. రెండు నగరాల్లోని ఫంక్షన్‌హాళ్లు వెలవెలబోతున్నాయి.

దివ్యాంగ పాఠశాలలో విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేసిన దాతలు

కుటుంబ సభ్యుల మధ్యే వేడుకలు..

కొవిడ్‌ నేపథ్యంలో వేడుకల పంథా పూర్తిగా మారిపోయింది. వివాహాలు సహా ఏ వేడుకనూ ఘనంగా నిర్వహించకునే పరిస్థితి లేదు. ప్రధానంగా సామూహిక కార్యక్రమాలు, విందులు, వినోదాలకు దాదాపుగా తెరపడింది. వివాహాలు సైతం చాలా వరకు వధూవరుల కుటుంబాలకు పరిమితమయ్యాయి. ఒకవేళ ఘనంగా నిర్వహిద్దామని హడావుడి చేసినా.. బంధువుల హాజరు తక్కువగా ఉంటోంది. ఆహార వృథా ఎక్కువగా అవుతోంది. మరోవైపు పోలీసుల ఆంక్షలు కూడా ఉండడంతో.. అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వేడుకల నిర్వాహకులు కూడా విందులకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. అనాథలకు, అన్నార్తులకు భోజనాలు సమకూర్చడం, నిత్యావసరాలు పంపిణీ, ఆర్థిక సాయం చేయడం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తున్నారు.

ఇటీవల విజయవాడలో అమ్మ ఓల్డేజ్‌ హోంను సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉమాదేవి

గుంటూరులో..

ఫంక్షన్‌హాళ్లు 80-100

ఏటా జరిగే వేడుకలు 15000 పైగా


* గుంటూరులో కొద్ది రోజుల క్రితం వెంకట్రావు అనే వ్యాపారి గుండెపోటుతో మృతిచెందారు. కర్మకాండను అతి తక్కువమందితో కానిచ్చేశారు బీదాబిక్కీ ప్రజలకు ప్రత్యేకంగా భోజనాలు అందజేశారు. సాధారణ రోజుల్లోనైతే చనిపోయిన వ్యక్తి స్థాయికి పెద్ద ఫంక్షన్‌ హాల్‌లో వేలాదిమందికి భోజనాలు, స్మారక బహుమతులు అందించేవారు. అదే డబ్బుతో కష్టకాలంలో అన్నార్తులకు భోజనం పెట్టడం సంతృప్తిని ఇచ్చిందని కుటుంబీకులు చెప్పారు.


* హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేంద్రప్రసాద్‌ తన మనవరాలి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో కేకు కోశారు. ఎలాంటి విందు కార్యక్రమం ఏర్పాటు చేయకుండా, పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా బెడద లేకుంటే ఘనంగా విందు కార్యక్రమం పెట్టుకునేవారిమని, ఆ ఖర్చును మరో మంచి పనికోసం వెచ్చించడం ఆనందంగా ఉందని రాజేంద్రప్రసాద్‌ కుటుంబసభ్యులు తెలిపారు.


వృద్ధ, అనాథాశ్రమాలకు సాయం..

విజయవాడ, గుంటూరుల్లో చాలామంది తమ పుట్టినరోజు, వివాహ దినోత్సవం లాంటి వేడుకలను వృద్ధ, అనాథాశ్రమాల్లో చేసుకుంటూ ఉంటారు. వారి మధ్యే కోక్‌ కట్‌చేసి, వారికి విందు ఏర్పాటు చేస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలతో కలిసి వారితో గడుపుతుంటారు. తాజాగా ఈ పంథా మరింత పెరిగింది. కొవిడ్‌ నేపథ్యంలో పుట్టినరోజు, ఇతర వేడుకలను నిర్వహించేందుకు రావడం లేదు. గతంలో మాదిరిగా విందు ఏర్పాటు చేయడం, వేడుకలు చేయడం కాకుండా.. నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆశ్రమానికి అవసరమైన నిత్యవసరాలను నెల, రెండు నెలలకు సరిపడా ఇచ్చేవారు పెరుగుతున్నారు. కొవిడ్‌ సమయంలో వృద్ధ, అనాథాశ్రమాల నిర్వహణ కూడా చాలా కష్టతరంగా మారింది. అందుకే.. ఇలాంటి వాళ్లు చేసే సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని విజయవాడ గుణదలలోని అమ్మ వృద్ధాశ్రమం నిర్వాహకులు రాంబాబు తెలిపారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న కొంతమంది ప్రముఖులు కూడా వచ్చి నిత్యావసరాలు, ఆర్థిక సాయం చేసి వెళుతున్నారన్నారు. తాజాగా రెండు రోజుల కిందట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉమాదేవి వచ్చారని పేర్కొన్నారు.


పారిశుద్ధ్య కార్మికులకే తొలి ప్రాధాన్యం..

విందులకు వెచ్చించే ఖర్చు తగ్గిపోవడంతో ఎక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులకు సహాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొవిడ్‌ పోరాటంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుంటున్న వారికి సామాన్య ప్రజలు కూడా తమకు తోచిన సహాయం చేస్తున్నారు. వేడుకల నిర్వాహకులు కూడా వీరికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. కార్మికులకు అవసరమైన నిత్యావసర సరకులను అందజేయడం, ఆర్థిక సాయం, ఆహారం పంపిణీ వంటివి చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని