చాంతడంతా జాబిత
eenadu telugu news
Updated : 26/07/2021 04:17 IST

చాంతడంతా జాబిత

భారీగా పేరుకుపోతున్న ఈ-చలానాలు

వసూలుకు పోలీసుల చర్యలు

ఈనాడు - అమరావతి

విజయవాడలో నానాటికీ పేరుకుపోతున్న చలానాలపై పోలీసులు దృష్టి సారించారు. ట్రాఫిక్‌ నియమావళిని అతిక్రమిస్తున్న వారిపై చలానాలు జారీ చేస్తున్నారు. వీటి సంఖ్య ఏటేటా పెరుగుతున్నాయి. జారీ అవుతున్న చలానాలను కూడా పెద్దగా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. వీటిని కడుతున్న వారు కొద్ది మంది మాత్రమే. జరిమానా మొత్తం చాంతాడంత పేరుకుపోతోంది. బకాయిదారులపై ఒత్తిడి తేవడంతో పాటు, చట్టాన్ని అధిగమించకుండా ఉండేలా చూడాలన్నది లక్ష్యం. చెల్లింపులపై పోలీసులు పెద్దగా ఒత్తిడి చేయకపోవడంతో కట్టేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ పరిస్థితిని మార్చేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎక్కువ దఫాలు ఉల్లంఘించిన వారిపై దృష్టి పెట్టారు.

నగర కమిషనరేట్‌ పరిధిలో భారీ వాహనదారుల నుంచి ద్విచక్ర వాహనదారుల వరకు మోటారు వాహన చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులలో హెల్మెట్‌ లేకుండా నడపడం, ముగ్గురితో వెళ్లడం వంటి ఎక్కువగా చేస్తున్నారు. మొబైల్‌లో మాట్లాడుతూ పలువురు దొరికిపొతున్నారు. వ్యతిరేక మార్గంలో వెళ్లడం, ఇద్దరికి మించి వాహనంపై ప్రయాణించడం, ప్రమాదకరంగా నడపడం, మితిమీరిన వేగంతో దూసుకుపోవడం, తదితర కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. హెల్మెట్‌, సీటు బెల్టు లేకపోయినా.. అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతున్నా ట్రాఫిక్‌ పోలీసులు చలానాలు రాస్తున్నారు. భారీ వాహనాలకు నగరంలోని పలు మార్గాల్లో పగటి పూట అనుమతి లేకపోయినా ప్రవేశించడం, వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడం వల్ల కూడా జరిమానాలు విధిస్తున్నారు.

కట్టడి చేసేందుకు దృష్టి

ఇంకా చెల్లించని చలానాలపై నగర పోలీసులు దృష్టి సారిస్తున్నారు. మొత్తం జాబితాను రూపొందించారు. ఇందులో ఎక్కువ మంది అధిక దఫాలు నిబంధనలను ఉల్లంఘించిన విషయం బయటపడింది. ఇప్పటి వరకు కేవలం ఉల్లంఘనలపై చలానాల జారీపై మాత్రమే దృష్టి పెట్టారు. దీని వల్ల చెల్లించే వారు చెల్లిస్తున్నారు, మిగిలిన వారు పట్టించుకోవడం లేదు. ఇది పరోక్షంగా ఉల్లంఘనలు పెరిగేందుకు దోహదం చేస్తుంది. పరిస్థితిని కట్టడి చేసేందుకు దృష్టి సారిస్తున్నారు. రవాణా శాఖ సర్వర్‌లోని వివరాలను బట్టి వీరికి తాఖీదులు జారీ చేస్తున్నారు. చాలా మంది అప్పటి చిరునామాల్లో నివాసం ఉండడం లేదు. దీని వల్ల తాఖీదులు ఉల్లంఘనులకు చేరడం లేదు. ఇది కూడా చెల్లింపులు పూర్తిగా జరగకపోవడానికి ప్రధాన కారణం. ముఖ్యమైన కూడళ్లలో పోలీసులు ప్రధానంగా కార్లు, భారీ వాహనాలను ఆపి, వివరాలను పరిశీలిస్తున్నారు. ఆ వాహనాలపై చలానాలు ఉంటే.. వాటి గురించి వాహనదారుడికి వివరిస్తున్నారు. తక్షణం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది డిజిటల్‌ పద్ధతుల్లో అప్పటికప్పుడు కడుతున్నారు.

చెల్లింపులూ అరకొరే

నిబంధనల ఉల్లంఘనలను ట్రాఫిక్‌ పోలీసులతో పాటు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన కెమెరాల నుంచి పరిశీలించి చిత్రీకరిస్తున్నారు. వీటి ద్వారా వాహనం నెంబరును గుర్తించి, ఈ-చలానా రూపొందించి పంపిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు తమ వద్ద ఉండే డిజిటల్‌ కెమెరా, మొబైల్‌లో ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోను తీసి వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నారు. వాహనదారుడి చిరునామాకు పంపిస్తున్నారు. వీటిని అందుకున్న వారు సక్రమంగా చెల్లించడం లేదు. ఇప్పటి వరకు 35 లక్షలు పైగా చలానాలు జారీ అయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు చెల్లించింది 18 లక్షలు మాత్రమే. పెండింగ్‌ చలానాల మొత్తం రూ. 29 కోట్ల వరకు పేరుకుపోయాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని