పంట నష్టం.. 3776 హెక్టార్లు!
eenadu telugu news
Published : 26/07/2021 03:54 IST

పంట నష్టం.. 3776 హెక్టార్లు!

మచిలీపట్నం, న్యూస్‌టుడే : ఇటీవల కురుస్తున్న వర్షాలు.. ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ఇంకా పొలాల్లో నీళ్లు కదలడం లేదు. డ్రెయిన్లు ఇప్పటికీ పొంగిపొర్లు తూనే ఉన్నాయి. జిల్లాలో వరితో పాటు పత్తి, పెసర వంటి పంటలు కూడా దెబ్బతిన్నాయి. పంట నష్టంపై వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 3.23 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ప్రణాళిక వేయగా ఇప్పటివరకు 1.13 లక్షల హెక్టార్లలో పలు పంటలు సాగయ్యాయి. దీనిలో 82 వేల హెక్టార్లకు పైగా వరి సాగవ్వగా మిగిలిన విస్తీర్ణంలో పత్తి, అపరాలు, మిర్చి, చెరకు తదితరాలున్నాయి. సకాలంలో నీళ్లు రాకపోవడంతో ఎక్కువమంది వెదపద్ధతిలో సాగు చేపట్టారు. తరువాత కాల్వలకు నీరు రావడంతో నారుమళ్లు, ముందస్తుగా వేసిన ప్రాంతాల్లో నాట్లు వేశారు. సాగు ముమ్మరమవుతున్న తరుణంలో కురిసిన వర్షాలు అన్ని పంటలను ముంచెత్తాయి. జిల్లాలోని 8 మండలాల్లో 84 గ్రామాల్లోని పొలాలు ముంపు బారిన పడ్డాయి. అధికారుల అంచనా ప్రకారం 3,776 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లితే అందులో 3,600 హెక్టార్లు వరి పంటే ఉండటం గమనార్హం. బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన, ముదినేపల్లి, గన్నవరం మండలాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. వత్సవాయి, వీరులపాడు మండలాల్లో పత్తి, మొక్కజొన్న, పెసర పంటలు దెబ్బతిన్నాయి.


పొంగుతున్న డ్రెయిన్లు

శని, ఆదివారాల్లో అంతగా వర్షాలు పడకపోయినా పొలాల్లో ముంపు మాత్రం తొలగలేదు. బందరు, గుడ్లవల్లేరు, గుడివాడ, పెడన తదితర మండలాల్లో వెదపొలాలు నీటిలో మునిగి నానుతున్నాయి. నీటిని తొలగించే ప్రయత్నం చేసినా ఎగువనుంచి వచ్చే మురుగు చేరుతుండటంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. వడ్లమన్నాడు, కొంకేపూడి, లజ్జబండ డ్రెయిన్లలో మురుగు గట్లకు సమాంతరంగా ప్రవహిస్తోంది. కొంకేపూడి డ్రెయిన్‌లో తూడు, జమ్ము మేటలు మురుగు పారుదలకు ఆటంకంగా మారాయి. ఇంకొన్ని రోజులు నీళ్లలోనే పంట ఉంటే కుళ్లిపోతుందని ఆవేదన చెందుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని