‘ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి’
eenadu telugu news
Published : 26/07/2021 04:13 IST

‘ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి’


రిలే దీక్షలో పాల్గొన్న అగ్రిగోల్డ్‌ బాధితులు

గాంధీనగర్‌, న్యూస్‌టుడే : పాదయాత్ర సమయంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సామాజిక విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. నగరంలోని హనుమంతరాయ గ్రంథాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాలుగో రోజుకు చేరాయి. వారికి ఆయన సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆయా సంస్థల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యతా ప్రభుత్వాలపైనే ఉందన్నారు. ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశించి 33 లక్షల మంది డబ్బులు దాచారని, అగ్రి గోల్డ్‌ సంస్థకు వివిధ రాష్ట్రాల్లో రూ.10వేల కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. వీటితో బాధితులు డిపాజిట్టు చేసిన రూ.7,500 కోట్లకు వడ్డీతో సహా చెల్లించవచ్చన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ.. బాధితుల సమస్య న్యాయమైనదేనని, వారు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. బాధితుల్లో అన్ని పార్టీల సానుభూతిపరులు, అన్ని సామాజికవర్గాల వారు ఉన్నారని గుర్తు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ పోతిన రామారావు మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వాగ్దానాలను విస్మరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుందన్నారు. అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 23 ఆర్థిక సంస్థలు నేరాలకు పాల్పడ్డాయని, దీని కారణంగా కోట్లాది మంది బాధితులు రోడ్డునపడ్డారన్నారు. ప్రజలను మోసగించిన ఆయా సంస్థల యాజమాన్యాలను ఉగ్రవాదులుగా ప్రకటించి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఎన్‌.లెనిన్‌బాబు, కె.వి.వి.ప్రసాద్‌, జి.రంగన్న, సూర్యారావు, ఆర్‌.పిచ్చయ్య, వి.తిరుపతిరావు, బి.వి.చంద్రశేఖర్‌, శేషుకుమార్‌రెడ్డి, శేషగిరి, సుధీర్‌, లోవరత్నం తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని