‘ప్రభుత్వ రంగాల ధ్వంసానికి మోదీ కుట్ర’
eenadu telugu news
Published : 26/07/2021 04:13 IST

‘ప్రభుత్వ రంగాల ధ్వంసానికి మోదీ కుట్ర’

అలంకార్‌కూడలి(విజయవాడ),న్యూస్‌టుడే : ప్రభుత్వ రంగాల ధ్వంసానికి ప్రధానమంత్రి మోదీ కుట్ర పన్నుతున్నారని పలువురు వక్తలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రైవేటీకరణ, కార్మిక, రైతాంగ వ్యతిరేక చర్యల్ని నిరసిస్తూ క్విట్‌ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 9న తలపెట్టిన సేవ్‌ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం నగరంలోని దాసరిభవన్‌లో ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ.. మోదీ విధానాలపై గళం విప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్సీ జల్లీ విల్సన్‌ మాట్లాడుతూ.. 10 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర సంఘాలతో కలిసి ఆగస్టు 9న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. దిల్లీలోని మోదీ పీఠం కదిలేలా గర్జించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్తు సవరణ బిల్లు-2020ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల పంపు సెట్లకు మీటర్లు బిగించారని, భవిష్యత్తులో వారి ఉచిత విద్యుత్తుకు ఎగనామం పెడతారని పేర్కొన్నారు. సహకార రంగాన్ని కేంద్రం తన గుప్పిట్లోకి పెట్టుకోవాలని కుట్ర పన్నుతోందన్నారు. మోదీ ప్రభుత్వం రైతాంగ విధానాల్ని ఎండగడుతూ ఈ నెల 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు పార్లమెంట్‌ వద్ద కిసాన్‌ సన్‌(రైతు పార్లమెంట్‌)ను కొనసాగిస్తున్నారని చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఆగస్టు 2, 3 తేదీల్లో పార్లమెంట్‌ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటసుబ్బయ్య, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి టి.తాతయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని