మట్టి మెక్కేస్తున్నారు...
eenadu telugu news
Published : 26/07/2021 04:13 IST

మట్టి మెక్కేస్తున్నారు...

నున్న సమీపంలో యథేచ్ఛగా తవ్వకాలు

ఈనాడు, అమరావతి

‘పోలవరం కాలువ మా భూముల నుంచి వెళ్లింది. కాలువ తవ్వి మట్టి, కంకర గుట్టలుగా పోశారు. అవి మా పొలంలో అడ్డుగా ఉన్నాయి. వాటిని తరలించేందుకు అనుమతించండి..! మా భూములను తిరిగి సేద్యం చేసుకునేందుకు అనువుగా మార్చుకొనే అవకాశం ఇవ్వండి..

- ఇదీ నీటిపారుదల శాఖకు ఓ రైతు చేసిన దరఖాస్తు


‘మా పొలంలో గ్రావెల్‌, నాణ్యమైన మట్టి ఉంది. తవ్వేందుకు అనుమతి తీసుకున్నాం. మీకు అవసరమైతే మాకు ఆర్డరు ఇవ్వండి. ఎంత కావాలన్నా తోలుతాం..!’

- ఇది ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకు రైతుల పేరుతో వచ్చిన విజ్ఞప్తి..!

పోలవరం కట్టపై ఓ గుత్తేదారుకు 5వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలకు జలవనరుల శాఖ, గనుల శాఖ అనుమతి ఇచ్చింది. కానీ ఆ కాంట్రాక్టరు దాదాపు 2లక్షల క్యూబిక్‌ మీటర్లు తవ్వి తరలించేశారు. దీనిపై ఇంతవరకు లెక్కలు తీసిన.. తనిఖీ చేసిన అధికారి లేరు. క్యూబిక్‌ మీటర్‌కు రూ.175 చొప్పున 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి విలువ రూ.3.50కోట్లు. కేవలం నెల రోజుల్లో ఆ వ్యక్తి కోటీశ్వరుడిగా మారారని గ్రామస్థులు చెబుతున్నారు.

గ్రావెల్‌ వ్యాపారం ఇప్పుడు మూడు లారీలు.. ఆరు టిప్పర్లుగా వర్ధిల్లుతోంది. ప్రభుత్వభూములు, పోలవరం కట్ట, ప్రైవేటు భూములు తేడా లేకుండా ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నారు విజిలెన్సు అధికారులకు, గనుల శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామస్థులు వాపోతున్నారు. ఎండైనా, వానైనా, రోడ్లన్నీ బురదమయమైనా టిప్పర్లు ఆగడం లేదు. కొండలు పిండి అయ్యాయి. కాలువ గట్లు కరిగిపోయాయి. ప్రైవేటు భూమలు చదును అయ్యాయి. నివేశన స్థలాల ప్లాట్లుగా వెలిశాయి. అక్రమార్కుల ఆదాయం పెరిగింది. వీరికి విజయవాడ గ్రామీణ మండలంలోని గ్రామాలు ఆదాయ వనరులుగా మారాయి. గన్నవరంలోనూ పలు గ్రామాల్లో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఉన్నత స్థాయి నుంచి అధికారుల సహకారం ఉందని బహింరంగంగా కాంట్రాక్టర్లు చెప్పుకుంటున్నారు. కింది స్థాయిలో అభ్యంతరం తెలిపిన అధికారులపై మాత్రం బదిలీవేటు వేసి మమ అనిపిస్తున్నారు.

పోలవరం కట్టపై ఇలా ఇష్టానుసారంగా తవ్వకాలు (పాతచిత్రం)

పోలవరం కాలువ జిల్లాలో 66 కిలోమీటర్లు మేర ఉంది. ఈ కాలువ గట్లపై ఎత్తుగా మట్టి పేరుకు పోయిందని రైతులతో దరఖాస్తులు చేయించి తవ్వకాలకు తెరలేపారు. దీనికి నేతల సహకారం లభించడంతో గత ఏడాది 2020లో అరకిలోమీటరుకు ఒకటి చొప్పున దాదాపు 120 ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చారు. ఆయా చోట్ల 5వేల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే తవ్వాల్సి ఉంటుంది. దీనికి జలవనరుల శాఖ పర్యవేక్షణ ఉండాలి. ఇలా మొత్తం 4.80 లక్షల క్యూబిక్‌ మీటర్లకు అనుమతి జారీ చేశారు. ఈ మొత్తాన్ని నెలలోపే తవ్వేశారు. వేర్వేరు రైతుల పేరుతో కొంతమంది నేతలు ఈ అనుమతులు తీసుకున్నారు. వాస్తవానికి కరకట్టలను, కాలువ కట్టలను తవ్వేందుకు అనుమతి ఉండదు. వాటికి భిన్నంగా అవసరానికి మించి కట్టలు ఉన్నాయని ధ్రువీకరించి తవ్వకాలు జరిపారు. దీనికి గాను జలవనరుల శాఖకు క్యూబిక్‌ మీటరుకు రూ.68, గనుల శాఖకు రూ.45 రాయల్టీ చెల్లించాలి. 5వేల క్యూబిక్‌ మీటర్లు అధికారం కాబట్టి దాని వరకు చెల్లించారు. కానీ ఒక్క ప్రాంతంలోనే 2లక్షల క్యూబిక్‌ మీటర్లు పైగా లేపేశారు. మొత్తం 120 ప్రాంతాల్లో దాదాపు రూ.240 కోట్ల విలువైన మట్టి తరలించారని అంచనా. గనుల శాఖ వాస్తవ కొలతలు తీస్తే ఈ పరిణామం వెలుగు చూసే అవకాశం ఉంది. కానీ ఎక్కడా తనిఖీలు లేవు. గ్రామస్థులు ఎవరైనా అడ్డుకుంటే తీవ్ర స్థాయిలో హెచ్చరికలు ఎదురవుతున్నాయి.

గడువు అయిపోయింది..

గ్రావెల్‌ తవ్వకాలపై గనుల శాఖ సహాయ సంచాలకులు నాగినిని సంప్రదించగా, గత ఏడాది ఇచ్చిన అనుమతులు గడువు పూర్తయిందని వివరించారు. ప్రస్తుతం పినైనవరం సమీపంలో ఒక్కచోట మాత్రమే తవ్వకాలకు అనుమతి ఉందని వెల్లడించారు. గతంలో ఇచ్చిన అనుమతి ప్రకారం పూర్తి స్థాయిలో తవ్వకాలు జరపకపోవడంతో వారు కొనసాగిస్తున్నారని తెలిపారు. పోలవరం కట్టపై పర్యవేక్షణ జలవనరుల శాఖ పరిధిలో ఉంటుందని చెప్పారు. ఒక్క ట్రిప్పుకు బదులు రెండు మూడు వేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు.


మా దృష్టికి రాలేదు..

దీనిపై జలవనరుల శాఖ పోలవరం కాలువ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తవ్వకాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. గతంలో ఇచ్చిన అనుమతులకు మిగిలి పోయిన వారు తవ్వి తీసుకెళ్లి ఉండవచ్చని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని