కృత్రిమ పరికరాలపై వైద్య విద్యార్థులకు శిక్షణ
eenadu telugu news
Published : 27/07/2021 04:52 IST

కృత్రిమ పరికరాలపై వైద్య విద్యార్థులకు శిక్షణ

గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రారంభానికి సిద్ధమైన స్కిల్‌ ల్యాబ్‌
ఈనాడు, అమరావతి
రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు వైద్య కళాశాలలో స్కిల్‌ ల్యాబ్‌ ఏర్పాటు
క రోగికి సూది మందు ఎలా ఇవ్వాలి? కాన్పులు ఎలా చేస్తారు, అంబులెన్స్‌లో తీసుకొచ్చే పేషెంట్‌కు బీపీ, పల్స్‌ వంటివి పడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో హౌస్‌సర్జన్లు, పీజీ వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలకు తెలియజేయడానికి గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)లో నైపుణ్య శిక్షణ ప్రయోగశాల (స్కిల్‌ ల్యాబ్‌)ను నిర్మించారు. ఇది ప్రారంభానికి సిద్ధమైంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో కృత్రిమ పరికరాల ద్వారా (రోబో తదితరాలు) కాన్పులు చేయడం, సూది మందు ఇవ్వడం ఎలాగో వారికి నేర్పించేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. రూ.1.4 కోట్లతో చేపట్టిన భవన నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పటికే గుత్తేదారు దాన్ని కళాశాలకు అప్పగించారు. దానిలో త్వరలో శిక్షణ మొదలుపెట్టాలనే యోచనలో జీఎంసీ కళాశాల ఉంది. గుంటూరు, తిరుపతి, విశాఖ ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఈ ల్యాబ్‌లు మంజూరయ్యాయి. తొలుత గుంటూరులోనే ఇది అందుబాటులోకి వచ్చింది. వైద్య-ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఈ శిక్షణ కేంద్రం ద్వారా వైద్య విద్యార్థులకు, పారా మెడికల్‌ ఉద్యోగులకు పరిచయం చేయడానికి వీలుగా ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. నేషనల్‌ ఎమర్జెన్సీ లైఫ్‌ సపోర్ట్‌(ఎన్‌ఈఎల్‌ఎస్‌) కోర్సును ప్రవేశపెట్టి విద్యార్థి వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. గుంటూరు జిల్లాలోని పీహెచ్‌సీలు, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లకు శిక్షణలో భాగంగా ఇక్కడ ఆయా అంశాలను నేర్పిస్తారు. ఇప్పటి వరకు ఈ రకమైన ఏర్పాట్లు లేకపోవటంతో వారికి ఉన్న సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. స్కిల్‌ల్యాబ్‌తో వారికి పరిష్కారం దొరకనుంది. అత్యవసర సమయాల్లో రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడుకోవడానికి ఏం చేయాలో సిమ్యులేషన్‌ పరికరాలపై తెలియజేయడానికి వాటిని కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కృత్రిమ రోగి (ఆర్టిఫిషియల్‌ పేషెంట్‌) వలే రబ్బరు బొమ్మలను ప్రయోగశాలలో ఉంచుతారు. ఈ బొమ్మలకు విద్యుత్‌ తరంగాలను పంపి కంప్యూటర్‌ ద్వారా అది సాధారణ రోగిలా ఉండేటట్లు తయారు చేస్తారు. దాని ద్వారా రక్తపోటు, నాడి, హృదయం పనితీరును ఎలా తెలుసుకోవాలో తెలియజేస్తారు. అవే కాదు శరీరంలోని పలు అవయవాల పనితీరును ఎలా తెలుసుకోవాలో ఇక్కడ శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని వైద్య కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఎస్‌.బాబులాల్‌ ‘ఈనాడు’కు తెలిపారు. గుత్తేదారు భవనాన్ని అప్పగించారని, ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే దాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో బోధనాసుపత్రిలో మొదటిసారిగా స్కిల్‌ ల్యాబ్‌ తమ కళాశాలలోనే నిర్మితమైందని చెప్పారు. ఇంజక్షన్లు చేయడం మొదలు శస్త్రచికిత్సల నిర్వహణ దాకా శిక్షణలో భాగంగా అనేక అంశాలను నేర్పిస్తాం. దీనికి పీహెచ్‌సీ, ఏరియా, సామాజిక ఆసుపత్రుల వైద్యులు వచ్చి తమకు తెలియని విషయాలను తెలుసుకోవచ్చని సూచించారు. ఈ కేంద్రానికి చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా జీజీహెచ్‌ వైద్యుడు ఆచార్య శ్రీనివాస ప్రసాద్‌ను నియమించారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని