స్పందన పునఃప్రారంభం
eenadu telugu news
Published : 27/07/2021 04:52 IST

స్పందన పునఃప్రారంభం

వివిధ శాఖలకు సంబంధించి 210 అర్జీలు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజలు వారి సమస్యలను నేరుగా జిల్లా అధికారులకు తెలియజేసేందుకు నిర్వహించే స్పందన కార్యక్రమం సుమారు 16 నెలల తర్వాత సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో ప్రారంభమైంది. తొలిరోజు వివిధ శాఖలకు సంబంధించి 210 అర్జీలు వచ్చాయి. గతంలో జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో తొలుత కంప్యూటరీకరణ అయ్యాకే అధికారులకు వినతిపత్రం అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కొద్దిగా మార్పులు చేశారు. ఈ విధానంతో అర్జీదారులు అధికారులను కలిసేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వరుస సంఖ్యలో స్పందన హాలులోకి పంపుతున్నారు. తొలుత అర్జీదారు వరుస సంఖ్యను నమోదు చేయించుకుని, అర్జీ రాసుకుని ఉంటే నేరుగా క్యూ లైన్‌లోకి వెళ్లవచ్ఛు లేకుంటే అక్కడే నియమించిన సిబ్బందితో అర్జీ రాయించుకుని క్యూలైన్‌లోకి వెళ్లాలి. వేదికపైన కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, పి.ప్రశాంతి, అనుపమ అంజలి, కె.శ్రీధర్‌రెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్‌ వినాయకం, డీఆర్‌వో కొండయ్యలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పాలనాధికారికి సమస్యను విన్నవించుకున్న తర్వాత అధికారుల సూచనతో ఉన్న పత్రాలను అక్కడే ఉన్న కంప్యూటర్‌లలో సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేసి, అర్జీదారులకు వారి ఫిర్యాదులు అందినట్లు సంబంధిత సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందనే వివరాలను తెలుపుతూ పత్రాన్ని అందిస్తున్నారు. భూములకు సంబంధించి, రేషన్‌ కార్డులు, చేయూత పథకం అందలేదని వంటి ఫిర్యాదులు వచ్చాయి. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో సమస్యలు పెండింగ్‌లో ఉంటే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టరు తెలిపారు.

 

* అర్జీదారులు చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్‌ను అందించినా భౌతిక దూరం పాటించేందుకు అనుకూలంగా లేకపోవడం, క్యూలైన్లలోనూ ప్రజలను దగ్గరగా ఉంచడంతో అక్కడున్న వారు కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ధ్రువపత్రాల జారీలో జాప్యం చేయొద్దు

గుంటూరు వైద్యం: సర్వజనాసుపత్రిలో జారీ చేసే జనన, మరణాలు, దివ్యాంగ ధ్రువపత్రాల జారీలో జాప్యం జరిగితే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తప్పవని జిల్లా సంయుక్త పాలనాధికారి ప్రశాంతి హెచ్చరించారు. శుశృతాహాలులో సోమవారం ‘స్పందన’ ఏర్పాటు చేశారు జీజీహెచ్‌లో ఒప్పంద విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ గుత్తేదారు సక్రమంగా చెల్లించకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి లక్షణాలతో సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన సూదిమందు లేదని వార్డులో తెలిపారని, ఇంజెక్షన్‌ ఇప్పించాలని పలువురు బాధితుల సహాయకులు జేసీని కలిసి విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని