ప్రణాళిక లేని బాటలో.. ప్రజాధనం వృథా
eenadu telugu news
Published : 27/07/2021 04:52 IST

ప్రణాళిక లేని బాటలో.. ప్రజాధనం వృథా

లేఅవుట్‌లో అడ్డదిడ్డంగా అంతర్గత రహదారుల నిర్మాణం

ఈనాడు, గుంటూరు, న్యూస్‌టుడే బృందం

 

నరసరావుపేట పట్టణంలో లేఔట్‌లో కొలతలు తేడా రావడంతో తొలగించిన హద్దు రాళ్లు

జిల్లాలో పట్టణ పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి సేకరించిన భూముల్లో వేసిన లేఔట్‌ ప్రణాళికలో యంత్రాంగం నడుమ సమన్వయం లోపంతో రూ.కోట్ల సామ్ము వృథా అయింది. భూమి చదును, ప్లాట్ల సరిహద్దు రాళ్ల ఏర్పాటు, అంతర్గత రహదారుల నిర్మాణంలో ఒక ప్రణాళిక ప్రకారం నిర్మాణాలు పూర్తిచేశారు. రాష్ట్రమంతా పట్టణ పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు కొలతలు ఒకేలా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో అప్పటివరకు చేసిన పనులు వృథా అయ్యాయి. దీంతో నరసరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి పట్టణాల పరిధిలో రూ.కోట్ల ప్రజాధనం వృథా అయింది. తాజాగా మళ్లీ అంచనాలు రూపొందించి రహదారులు నిర్మిస్తున్నారు. అధికారుల సమన్వయ లోపం, నేతల హడావుడి వల్ల ఈ పరిస్థితి నెలకొంది.

జిల్లాలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు సేకరించింది. ఇందులో స్థానిక అవసరాలకు అనుగుణంగా లేఔట్‌ ప్రణాళిక తయారుచేసి ఒక్కొక్క లబ్ధిదారుడినికి సెంటు స్థలం చొప్పున ప్లాట్లు వేసి అంతర్గతంగా రహదారులు మట్టితో ఏర్పాటుచేశారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల పాట్లకు సంబంధించిన పొడవు, వెడల్పు కొలతలు రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా ఉండాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో ముందు వేసిన లేఔట్‌ ప్రణాళికను తొలగించి కొత్త కొలతలతో ప్లాట్లు వేశారు. దీంతో ముందుగా వేసిన అంతర్గత రహదారులు, ప్లాట్ల సరిహద్దు రాళ్లు తొలగించి కొత్తగా మళ్లీ వేయాల్సి వస్తోంది. నరసరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి పట్టణాల్లో పేదలకు కేటాయించిన లేఔట్లలో మరోసారి పనులు చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో ఇప్పటికే చదును చేసిన స్థలాలు ఇంకా లోతట్టు ప్రాంతంలోనే ఉండటంతో మరో మూడు అడుగుల మేర మట్టి తోలి ఎత్తు పెంచాలని క్షేత్రస్థాయి యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. గృహనిర్మాణశాఖ, మున్సిపల్‌, డ్వామా యంత్రాంగం నడుమ సమన్వయలోపంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన అంతర్గత మట్టి రోడ్లు మళ్లీ వేయాల్సి రావడంతో ప్రజాధనం వృథా అవుతోంది.

పిడుగురాళ్ల పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన లెనిన్‌నగర్‌లో పాత లేఔట్‌ తొలగించి నూతన రహదారులు వేసిన దృశ్యం


సత్తెనపల్లి పట్టణంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీలో భాగంగా 3577 మందికి ఇంటి పట్టాలు ఇచ్చారు. వీరందరికీ అబ్బూరు, మారుతినగర్‌, గండ్లూరు, పాకాలపాడు, భీమవరం, కంకణాలపల్లి, ధూళిపాళ్ల గ్రామాల పరిధిలో నివాసస్థలాలు కేటాయించారు. పట్టణ వాసులకు కేటాయించిన లేఔట్‌లో అంతర్గత రహదారుల నిర్మాణానికి రూ.70 లక్షల వరకు సొమ్ము వెచ్చించారు. లేఔట్‌లో ప్లాట్ల సరిహద్దు రాళ్లు వేయడం, అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయిన తర్వాత కొలతలు తేడా ఉన్నాయని మళ్లీ ప్లాట్ల సరిహద్దులు మార్చారు. దీంతో అంతర్గత రహదారుల మధ్యలో ప్లాట్ల సరిహద్దు రాళ్లు రావడంతో రహదారుల స్థానంలో మళ్లీ కొత్తగా నిర్మించాల్సి వస్తోంది. ఇందుకు సుమారు రూ.40లక్షల వరకు సొమ్ము వెచ్చించాల్సి వస్తుందని ప్రతిపాదనలు తయారుచేశారు.


నరసరావుపేట పట్టణంలోని పేదలు 6016 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వీరికి ఉప్పలపాడుతోపాటు జాతీయ రహదారి పక్కన ఉన్న భూములను కేటాయించారు. ఇందులో వీరికి ప్లాట్లు సరిహద్దు రాళ్లు పూడ్చి అంతర్గత రహదారులు వేశారు. తర్వాత ఇళ్ల కొలతలు మార్చడంతో రాళ్లు, రహదారులు తొలగించి మళ్లీ కొత్తగా వేస్తున్నారు. గతంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు సుమారు రూ.3కోట్లు వెచ్చించి చదును, రాళ్లు వేయడం, రహదారుల నిర్మాణం చేపట్టారు. వీటి స్థానంలో ఇప్పుడు రూ.1.60 కోట్లతో పనులు చేస్తున్నారు. ఇక్కడ పెద్దఎత్తున సొమ్ము మళ్లీ కేటాయించాల్సి రావడంతో ఉన్నతాధికారి సంబంధిత బాధ్యులపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.


పిడుగురాళ్ల పట్టణంలోని పేదలకు లెనిన్‌నగర్‌లో 173 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇక్కడ కొలతలు తేడా రావడంతో ముందుగా వేసిన ప్లాట్ల సరిహద్దు రాళ్లు తొలగించారు. అంతర్గత రహదారులు సైతం తొలగించి కొత్తగా నిర్మిస్తున్నారు.


బాధ్యులెవరూ..?

పట్టణ పేదలకు కేటాయించిన స్థలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాటికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా భూమి చదును, హద్దు రాళ్లు ఏర్పాటు, అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టారు. స్థలాలు పట్టణ ప్రాంతంలో ఉన్న వాటికి జిల్లా యంత్రాంగం నిధులు మంజూరు చేసింది. మారిన కొలతల ప్రకారం మళ్లీ పనులు చేయడానికి ఉపాధి హామీ పథకం నిబంధనలు అంగీకరించకపోవడంతో యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. నేతలు క్షేత్రస్థాయి యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నా మార్గదర్శకాలు అడ్డంకిగా ఉన్నందున తామేమి చేయలేమని చేతులెత్తేశారు. ఈక్రమంలో జిల్లా కలెక్టర్‌ పరిధిలోని నిధులతో మళ్లీ పనులు చేయాలని నిర్ణయించారు. అయితే రూ.కోట్ల సొమ్ము ప్రజాధనం వృథా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని