పల్లెనిద్రకు గ్రామీణ ఎస్పీ
eenadu telugu news
Published : 27/07/2021 04:52 IST

పల్లెనిద్రకు గ్రామీణ ఎస్పీ


గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.. సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఎంతో వ్యయప్రయాసలకోర్చి రావడం చూసి వారి ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో ప్రతి బుధవారం డయల్‌ యువర్‌ ఎస్పీ ఈ నెల 28 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు గ్రామీణ పరిధిలోనివారు ఎక్కడ నుంచి అయినా బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 86884 05050కు ఫోన్‌ చేస్తే స్వయంగా ఎస్పీ మాట్లాడతారని తెలిపారు. ఫిర్యాదుల స్థాయినిబట్టి అప్పటికప్పుడే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయిస్తామన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ఇప్పటికే దిశ యాప్‌కు వచ్చిన పలు ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పారు. సోమవారం పోలీసు కార్యాలయంలో స్పందన కొనసాగుతుందని, అదేవిధంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ రోజు అయినా ఎప్పుడైనా ప్రజలు నేరుగా తనను కలిసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. అదేవిధంగా గ్రామీణ ఎస్పీ వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు తమ సమస్యలను, తమ చుట్టుపక్కల జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై ఫిర్యాదులు, సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని ఎస్పీ చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని