ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో టోకరా
eenadu telugu news
Published : 27/07/2021 04:52 IST

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో టోకరా

రాష్ట్ర వ్యాప్తంగా రూ. 500 కోట్లు స్వాహా

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: సైబర్‌ నేరగాళ్లు యువతకు మాయమాటలు చెప్పి రూ.కోట్లలో దోచుకున్న వైనంపై బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సోమవారం పలువురు యువకులు గుంటూరు పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. సైబర్‌ నేరగాళ్లు తమను మోసగించిన తీరును విలేకరులకు వివరించారు. టెలిగ్రామ్‌ ద్వారా లింకులుపెట్టి వాటిని క్లిక్‌ చేస్తే ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా ఇంట్లో నుంచి రూ.లక్షలు సంపాదించవచ్చంటూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే పూల్‌ఇన్‌ డాట్‌కాం అనే సైట్‌ తెరుచుకుంటుంది. ఆ సైట్‌ ద్వారా బ్రెవ్‌ అనే వ్యక్తి ఛాటింగ్‌ చేస్తుంటాడు. ఇదే తరహాలో తమ సైట్‌లో రూ.4 వేల నుంచి లక్షల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చని తెలిపాడు. పెట్టుబడి పెట్టినవారికి ఐడీ జారీ చేయడంతోపాటు ఆ మొత్తానికి రోజుకు నాలుగు శాతం డబ్బులు కలిపి చెల్లిస్తామన్నాడు. ఒకసారి పెట్టుబడి పెడితే 300 రోజులపాటు డబ్బులు జమ చేస్తామని నమ్మించాడు. అంటే రూ.4 వేలు పెట్టుబడి పెట్టిన వారికి 300 రోజులకు రూ.45 వేల వరకు ఆదాయం వస్తుందంటూ చెప్పాడు. ఐడీ తీసుకున్నవాళ్లు ఇతరులచే పెట్టుబడి పెట్టించి వారికి ఐడీ ఇప్పిస్తే రూ.లక్షకు రూ.15 వేల చొప్పున కమీషన్‌ చెల్లిస్తామని తెలిపాడు. పలువురు యువత ఈ ప్రకటనకు ఆకర్షితులై పెట్టుబడి పెట్టగా.. మొదట్లో నాలుగు రోజుల పాటు డబ్బులు జమ చేశాడు. దీంతో కొందరు మిత్రులను కూడా ఒప్పించి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టారు. అలా మంగళగిరికి చెందిన ఓ యువకుడు రూ.19 లక్షలు, శ్రీకాకుళానికి చెందిన అతని మిత్రుడు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు.

సర్వర్‌ బిజీ అంటూ కాలక్షేపం.. మోసం

పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించిన తర్వాత సైట్‌ పని చేయకపోవడంతో అనుమానం వచ్చిన యువత ఆన్‌లైన్‌ ద్వారా ఛాటింగ్‌ చేయగా.. ‘సర్వర్‌ బిజీగా ఉంది. కొద్ది రోజుల్లో సొమ్ము జమ చేస్తాన’ంటూ బ్రెవ్‌ సమాధానమిచ్చాడు. మే 18న సైట్‌ ఓపెన్‌ చేసి జులై 15 వరకు సైట్‌ను పూర్తిగా తొలగించినట్లు బాధితులు వాపోయారు. తమలాగా రాష్ట్రవ్యాప్తంగా 600 మంది బాధితులు ఉంటారని, మొత్తంగా సుమారు రూ.500 కోట్ల వరకు వసూలు చేసుకొని ఆన్‌లైన్‌ సైట్‌ను తొలగించినట్లు తెలిపారు. తాము కొద్దిరోజుల కిందట మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ద్వారా అయితే అతని ఫోన్‌నంబర్‌, ఇతర వివరాలు తెలుస్తాయని భావించి తెలివిగా టెలిగ్రామ్‌ ద్వారా లింకులు పెడుతున్నాడని చెప్పారు. సైబర్‌ నేరగాడ్ని పట్టుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని