ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు
eenadu telugu news
Published : 27/07/2021 05:08 IST

ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు


నిందితుడిని శిక్షించాలని కోరుతూ వాసిరెడ్డి పద్మకు వినతిపత్రాన్ని అందజేస్తున్న నాగమల్లేశ్వరరావు

నగరంపాలెం(గుంటూరు), న్యూస్‌టుడే: ముక్కుపచ్చలారని పసికందు, దివ్యాంగ యువతిపై కామాంధులు అత్యాచారానికి పాల్పడటం సిగ్గుచేటని, ఈ రెండు ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించేలా చూడాలని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్తానని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గుంటూరు జిల్లాలో రెండు వేర్వేరు సంఘటల్లో అత్యాచారానికి గురై జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 28 ఏళ్ల యువతి, 7 నెలల పసికందును సోమవారం మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని రొంపిచర్ల మండలానికి చెందిన దివ్యాంగ యువతి(28) పశువులు మేపేందుకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన శేషులు అత్యాచారానికి పాల్పడటం దుర్మార్గమన్నారు. మాచర్ల ప్రాంతానికి చెందిన 7 నెలల పసికందుపై కూడా ఒక కామాంధుడు అత్యాచారానికి పాల్పడటం దారుణమన్నారు. ఈ రెండు ఘటనల్లో నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని, వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి మహిళా కమిషన్‌ తరఫున విజ్ఞప్తి చేస్తామన్నారు. దివ్యాంగ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించి, బాధిత యువతికి ప్రభుత్వం తరఫున పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని రజక సంఘం ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, నాయకుడు పాపారావు ఛైర్‌పర్సన్‌ పద్మకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మహిళా కమిషన్‌ సభ్యురాలు కె.జయశ్రీ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఆచార్య ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని