కౌలు నగదు ఇవ్వాలంటూ వినతి
eenadu telugu news
Published : 27/07/2021 05:08 IST

కౌలు నగదు ఇవ్వాలంటూ వినతి


కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న అమరావతి ప్రాంత రైతులు

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : తమకు బకాయి ఉన్న కౌలు నగదు ఇవ్వాలంటూ అమరావతి దళిత జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలోని ఉద్దండరాయుని పాలెం, లింగాలపాలెం, రాయపూడి తదితర గ్రామాలకు చెందిన అసైన్డ్‌(లంక), భూములకు చెందిన దళిత రైతులు సోమవారం ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీ నరసింహంకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆయా గ్రామాల రైతులు నగరంలోని ఏఎంఆర్‌డీఏ కార్యాలయం వద్దకు రాగా, తొలుతగా పోలీసులు అడ్డుకున్నారు. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు చెప్పడంతో.. జేఏసీ కన్వీనర్‌ మార్టిన్‌ రూథర్‌బాబుతో పాటుగా మరో అయిదుగురు రైతులను కమిషనర్‌ను కలిసేందుకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా రూథర్‌బాబు, నాయకుడు పూల రవి, రైతులు మాట్లాడుతూ... అసైన్డ్‌ రైతులకు మూడేళ్ల నుంచి కౌలు నగదు ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ కూలీలకు పింఛను రూ.5వేలకు పెంచుతానని చెప్పారని, అదీ అమలు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వం 90శాతం టిడ్కో ఇళ్లు పూర్తి చేసిందని, మిగిలిన 10శాతం ఇళ్లను వైకాపా ప్రభుత్వం పూర్తి చేసి ఇవ్వాలని కోరుతున్నా.. ఇవ్వడం లేదన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. దొండపాడు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులోని కంకర, మట్టిని అక్రమార్కులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉద్దండరాయుని పాలెం గ్రామ గృహాల పక్కన ఉన్న ఎన్‌ 10 రోడ్డులోని కంకర, డస్ట్‌ను దొంగలు దోచుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వం అసైన్డ్‌ రైతులకు లబ్ధి చేకూరేలా ఇచ్చిన జీవో 41తో రిజిస్ట్రేషన్‌ సౌకర్యం కలిగిందన్నారు. ఆ జీవోను ప్రస్తుత వైకాపా ప్రభుత్వం రద్దు చేసి, జీవో 72ను ఇచ్చిందన్నారు. దీనివల్ల అసైన్డ్‌ రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. అసైన్డ్‌ రైతుల సమస్యలన్నీ పరిష్కరించాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని