మీరైనా న్యాయం చేయండయ్యా
eenadu telugu news
Published : 27/07/2021 05:08 IST

మీరైనా న్యాయం చేయండయ్యా


ఫిర్యాదులు స్వీకరిస్తున్న అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనకు జిల్లా నలుమూలల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ, ఏఎస్పీలు గంగాధరం, మనోహరరావు, మూర్తి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి ఆదేశించారు.

బాలికపై అత్యాచారయత్నం

13 ఏళ్ల మా కుమార్తె 8వ తరగతి చదువుతోంది. గత నవంబర్‌లో నా కుమార్తెపై రాయపూడికి చెందిన వెంకటేశ్వరరావు అత్యాచారయత్నం చేశాడు. నవంబర్‌ 2న తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఎనిమిది నెలలు గడచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రూరల్‌ ఎస్పీ తనకు బాగా తెలుసు.. మీరేం చేయలేరంటూ నిందితుడు బెదిరిస్తున్నాడు. సీఎం మహిళా పక్షపాతి అంటున్నారు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.

- బాధితురాలి తల్లిదండ్రులు


కానిస్టేబుల్‌ చిట్టీలు వేసి డబ్బులివ్వడంలేదు

గుంటూరు అర్బన్‌లో పని చేస్తున్న కొండయ్యకాలనీకి చెందిన ఓ కానిస్టేబుల్‌, అతని భార్య ప్రైవేట్‌ చిట్టీలు వేస్తూ నమ్మించారు. వారి మాటలు నమ్మి చిట్టీలు కట్టాం. మణికుమారికి రూ. 2 లక్షలు, పద్మావతికి రూ. 2 లక్షలు, రూబిన్‌కు రూ. 3.5 లక్షలు ఇవ్వాలి. 2018 నుంచి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. కానిస్టేబుల్‌ తమకు ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చారు.

- మణికుమారి, పద్మావతి, రూబిన్‌, కొండయ్యకాలనీ


మారణాయుధాలతో బెదిరిస్తున్నారు

మా కుమార్తెను సెంట్రింగ్‌ పనిచేసే వ్యక్తితో వివాహం చేశాం. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. మా వద్దే ఉంచుకున్నాం. ఇటీవల నా కుమార్తె మృతి చెందింది. అప్పటి నుంచి ఆ పిల్లలను ఇవ్వాలని.. లేకపోతే మమ్మల్ని చంపేస్తానంటూ అతను కొంతమంది వ్యక్తులను మా ఇంటికి తీసుకువచ్చి మారణాయుధాలతో బెదిరిస్తున్నాడు. రక్షణ కల్పించాలని కోరుతున్నాం.

- జాన్‌బీ కుమారుడు బాజీ, వెనిగండ్ల


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని